నేడు ఢిల్లీకి రేవంత్​

  • వరంగల్ సభకు రాహుల్​ను ఆహ్వానించనున్న సీఎం
  • ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నడిప్యూటీ సీఎం భట్టి
  • రెండురోజులుగా అక్కడేఉంటున్న మంత్రి ఉత్తమ్​
  • నామినేటెడ్ పోస్టులు, పీసీసీ చీఫ్,కేబినెట్ విస్తరణపై చర్చించే చాన్స్!

హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులో వరంగల్​లో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. శనివారమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ కి చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత రెండు రోజులుగా అక్కడే ఉన్నారు.

మరో రెండు వారాల్లో ఆషాఢ మాసం కూడా ముగియనుండడంతో పెండింగ్ లో పడిన పదవుల పంపకంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రేవంత్, భట్టి, ఉత్తమ్..ఈ ముగ్గురు కీలక నేతలు ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో భేటీ కానుండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో పలు రకాల చర్చకు తెరలేపినట్లయింది. రాహుల్​ను వరంగల్ సభకు ఆహ్వానించడమే ప్రధాన ఎజెండాగా ఏఐసీసీ నేతలతో ఈ ముగ్గురు నేతల భేటీ జరగనున్నప్పటికీ.. వీటితోపాటు పెండింగ్​లో ఉన్న అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్నది.

భర్తీ చేయని మరో 20 నామినేటెడ్ పోస్టులతోపాటు పీసీసీ చీఫ్ నియామకం, మంత్రి మండలి విస్తరణ వంటి అంశాలపై ఈ భేటీలో ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర నేతలు డిస్కస్​ చేస్తారనే టాక్ వినిపిస్తున్నది.

రాహుల్​ను ఆహ్వానించేందుకే..

రాహుల్ గాంధీని ఈ నెలాఖరున రాష్ట్రానికి ఆహ్వానించడమే ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్ ఆదివారం ఢిలీ వెళ్తున్నారని పీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ అమలు ప్రక్రియను ప్రారంభించడంతో.. 2022 లో  ‘వరంగల్ డిక్లరేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకున్నట్లయింది. ఇదే విషయాన్ని ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కు వివరించనున్నారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే విషయాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు రుణమాఫీ అమలుపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చేయడంలో భాగంగా అదే వరంగల్ లో ఈ నెలాఖరులో రైతు కృతజ్ఞత సభకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర టూర్ కు రాహుల్ వచ్చే తేదీని తన ఢిల్లీ పర్యటనలో రేవంత్ ఖరారు చేయనున్నారు.  

నామినేటెడ్ పదవులపై చిగురిస్తున్న ఆశలు

ముగ్గురు కీలక నేతలు ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అవుతుండడంతో కార్పొరేషన్​ పదవులపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. పది రోజుల కిందట 35  రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ప్రభుత్వం..ఇంకా మరో 20  పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది . దీంతో ఆశావహులు తమ  ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ పోస్టుపై కూడా హైకమాండ్ వద్ద చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్నది. మధు యాష్కీ, మహేశ్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ లలో ఒకరి పేరును ఈ భేటీలో ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఇక మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ 4 మాత్రమే భర్తీ చేస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు వాటిపై కూడా చర్చించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక నామినేటెడ్ పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతోపాటు పలువురు మహిళా నేతలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా, కేసీ వేణుగోపాల్‌‌ను కలిశారు. సోమవారం రాహుల్ ను కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ అక్కడే ఉండడంతో వారిని కూడా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కలిసే ప్రయత్నం చేస్తున్నారు.