- బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
- హెలీప్యాడ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే బీర్ల
యాదగిరిగుట్ట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదగిరిగుట్టకు రానున్నారు. సోమవారం ప్రారంభమయ్యే శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో ప్రొటోకాల్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆదివారం ప్రభుత్వ విప్, బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతు జెండగే గోశాల ప్రాంగంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించి ఆఫీసర్లు, పోలీసులకు సూచనలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు కూడా రానున్నారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం యాదగిరి గుట్ట నుంచి నేరుగా భద్రాచలం వెళ్లనున్నారు.
సీఎం రాక సందర్భంగా దర్శనాలు బంద్
సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయానికి వస్తుండడంతో భద్రతాపరమైన కారణాల రీత్యా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని రకాల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లిపోయే వరకు కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యాక దర్శనాలు పునరుద్ధరించి, వాహనాలను కొండపైకి అనుమతిస్తామని భక్తులు సహకరించాలని కోరారు.