హైదరాబాద్: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి మరో భారీ గుడ్ న్యూ్స్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. ఈ ఏడాది చివరికల్లా మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తీపి కబురు చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ (సెప్టెంబర్ 11) శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్సైల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. కానీ తమ ప్రభుత్వం వచ్చాక వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోందని చెప్పారు.
ALSO READ : పెద్ద మనస్సు చాటుకున్న తెలంగాణ పోలీసులు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం
బీఆర్ఎస్ హయాంలో టీజీ పీఎస్సీలో అన్నీ లీకేజీలు ఉండేవని.. మేం అధికారంలోకి రాగానే టీజీ పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఇప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని గుర్తు చేశారు. మా ప్రభుత్వ పని తీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.