
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (ఫిబ్రవరి 17) బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌరసరఫరాల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ, కొత్త కార్డుల జారీపై అధికారులతో చర్చించారు. అలాగే.. ప్రభుత్వం జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే.. వచ్చే ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని.. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా, 2025, జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయింది.
కొందరికి రేషన్ కార్డులు జారీ చేసి.. మరికొందరికి ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్.. రేషన్ కార్డుల జారీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమెల్సీ కోడ్ అమల్లో లేని జిల్లాలో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో లేదు. సీఎం ఆదేశాలతో ఈ మూడు జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది.