- కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? సీఎం పదవి ఎక్కడిది?
- అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. సంజయ్ చేసిందేమీ లేదని కామెంట్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాణిక్కం ఠాగూర్ కు రూ.50 కోట్లు ఇచ్చి, ఢిల్లీ నుంచి మేనేజ్ మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. ప్రజలంతా కలిసి రేవంత్ ను ఎన్నుకోలేదని, ఆయన కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని కామెంట్ చేశారు. ‘‘గులాబీ జెండా కనవడకుండా చేస్తామని పెద్దపెద్ద తీస్ మార్ ఖాన్లు మాట్లాడిన్రు. ఆ తీస్ మార్ ఖాన్లతోనే కాలేదు.. నీలాంటి బుడ్డర్ ఖాన్లతోని ఏమైతది. నీలాంటోళ్లు మస్తుగా వస్తరు.. పోతరు. కాలం కలిసొస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడ్తయ్. తంతే గారెల బుట్టలో పడ్డట్టు పడ్డవ్” అని రేవంత్ ను ఉద్దేశించి విమర్శించారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? సీఎం పదవి ఎక్కడిదని ప్రశ్నించారు.
కారుకు సర్వీసింగ్ అవసరమైంది..
కారుకు స్పీడ్ ఎక్కువైందని, అందుకే సర్వీసింగ్ అవసరమైందని కేటీఆర్ అన్నారు. ‘‘గత 24 ఏండ్ల నుంచి కారుకు స్పీడ్ ఎక్కువైంది. ప్రస్తుతం సర్వీసింగ్ అవసరం పడింది. సర్వీసింగ్ చేసుకుని 100 స్పీడ్ తో రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తాం. ఈ ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమే’’ అని చెప్పారు. ‘‘కార్యకర్తలు ఓటమి డిప్రెషన్ నుంచి బయటకు రావాలి. ప్రజలు బీఆర్ఎస్ కు మూడో వంతు స్థానాలు ఇచ్చారు.14 స్థానాల్లో 5వేల లోపు ఓట్ల తేడాతోనే మన పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మనకు మరో 14 సీట్లు వచ్చి ఉంటే, ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది. కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోవడం దురదృష్టకరం” అని అన్నారు. ఎలక్షన్లు రాగానే తనపై పుకార్లు వస్తుంటాయని, సిరిసిల్ల నుంచి వెళ్లిపోతున్నట్టు రాస్తుంటారని.. అలాంటివి నమ్మి కార్యకర్తలు ఆగం కావద్దని, తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను వదిలిపెట్టేది లేదని చెప్పారు.
ధర్మం కోసం పనిచేసేటోళ్లు మఠం పెట్టుకోవాలె..
బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. ‘‘ధర్మం కోసం పనిచేసేటోళ్లు మఠమో, లేదంటే ఆశ్రమమో పెట్టుకోవాలి. దేవుని కోసం పని చేసేటోళ్లు కాశీలోనో లేదా ఇంకోచోట మత పెద్దలుగా గుడుల్లో పని చేయాలి. కానీ రాజకీయాలు చేసేటోడు ప్రజల కోసం కొట్లాడాలి” అని సంజయ్ ని ఉద్దేశించి అన్నారు. ‘‘సంజయ్ తెలంగాణకు చేసిందేమీలేదు. ఆయనతెలంగాణకు, కరీంనగర్ నియోజకవర్గానికి ఒక్క గుడి, బడి తేలేదు. ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి మంజూరు చేయించలేదు. ఎంపీ కోటా కింద ఉండే ఐదు కోట్లను కూడా ఖర్చు పెట్టలేదు. కేసీఆర్ ను తిట్టుడు, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసిందేమీ లేదు” అని విమర్శించారు.
కేసీఆర్ అపోజిషన్‌లో ఉంటేనే డేంజర్..
కాంగ్రెస్ అసాధ్యమైన హామీలిచ్చి, ప్రజలను బురిడీ కొట్టించిందని కేటీఆర్ అన్నారు. ‘‘ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు ఉన్నాయి. ప్రతి హామీని నేరేవేర్చే వరకూ ప్రతిపక్షంగా వెంటపడ్తాం” అని చెప్పారు. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు రూ.2,500, రైతు బంధు కింద రూ. 15వేలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు రైతుబంధు ఇంకా పూర్తిగా వేయలేదు. మార్పు రావాలని ఓటేసిన ప్రజలు.. కాంగ్రెస్ పాలన చూసి నెత్తినోరు కొట్టుకుంటున్నారు” అని అన్నారు. ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, ఆ పాత్రలో కూడా రాణిస్తామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. ‘‘స్పీకర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేం సహకరించాం. కానీ స్పీకర్ ఎన్నిక తర్వాత పెట్టిన గవర్నర్ ప్రసంగం ఓ గల్లీస్థాయి కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్టుగా ఉంది. అసెంబ్లీలో నేను, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి కాంగ్రెస్‌కు దీటుగా బదులిచ్చాం. కేసీఆర్ తయారు చేసిన ముగ్గురు సైనికులే అసెంబ్లీలో ఇలా మాట్లాడితే, రేపు కేసీఆర్ వస్తే అసెంబ్లీలో ఎలా ఉంటుందో ఊహింకోవచ్చు. కేసీఆర్ రూలింగ్ లో కంటే అపోజిషన్ లో డేంజరస్ గా ఉంటారు” అని అన్నారు.