జనాభా లెక్కల్లో కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి

జనాభా లెక్కల్లో కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి

హైదరాబాద్, వెలుగు: 2025లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలవనుందని చెప్పారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సోదరుడి కూతురు వివాహానికి రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు.

ఈ భేటీలో కులగణన సర్వేతో పాటు మూసీ పునరుజ్జీవంపై చర్చ జరిగినట్టు తెలిసింది. పేదలు నష్టపోకుండా చూడాలని, పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎంకు గవర్నర్ సూచించినట్టు సమాచారం. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించామని, పరిహారం అందించడంలోనూ ఇబ్బందుల్లేవని గవర్నర్ కు సీఎం చెప్పినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు.