నోరెళ్లబెడ్తున్న చెరువులు .. జీవో 69 అమలును పక్కన పెట్టిన గత పాలకులు

 నోరెళ్లబెడ్తున్న చెరువులు ..  జీవో 69 అమలును పక్కన పెట్టిన గత పాలకులు

 

మహబూబ్​నగర్​, వెలుగు : చలికాలంలోనే చెరువులు ఎండిపోతున్నాయి. గతేడాది వర్షాలు అంతంతమాత్రంగా పడడంతో జనవరి మొదట్లోనే భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో యాసంగి సాగుపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ చెరువులన్నింటినీ వరదల సమయంలో కృష్ణానది జలాలతో నింపాల్సి ఉన్నా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పదేండ్ల కింద అప్పటి కొడంగల్​ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జీవో 69ని సాధించినా, బీఆర్ఎస్​ ప్రభుత్వం ఈ జీవోను పక్కన పెట్టేసింది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడు చెరువుల కింద ఆయకట్టుతో పాటు తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు.

బోర్లే దిక్కు.. 

మక్తల్, నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గాల పరిధిలో 3.90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగువుతున్నాయి. ప్రధానంగా భీమా స్కీం కింద సాగునీటి కాల్వలు ఉండడంతో మక్తల్, మాగనూరు, నర్వ మండలాల్లోని కొన్ని గ్రామాలకు, కోయిల్​సాగర్​ ద్వారా మరికల్, ధన్వాడ మండలాల్లోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతోంది. ఈ మండలాల్లో మిగిలిన గ్రామాలతో పాటు దామరగిద్ద, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, గుండుమాల్, కొత్తపల్లి, కొడంగల్​ తదితర మండలాల్లో రైతులు చెరువుల కింద పంటలు సాగు చేసుకుంటున్నారు.

అయితే, ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో చెరువులు నిండలేదు. జిల్లా వ్యాప్తంగా 1,125 చెరువులు ఉండగా, దాదాపు 800 చెరువులు ఇప్పటికే నీళ్లు అడుగంటిపోయాయి. మరికొన్ని చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం యాసంగి సాగు సీజన్​ కావడంతో రైతులు పంటలు వేసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. బోర్లు ఉన్న రైతుల్లో కొందరు సాగుకు సిద్ధమవుతుండగా, చెరువులపై ఆధారపడిన రైతులు పడావు పెట్టేందుకు నిర్ణయించుకున్నారు.

పదేండ్లుగా పట్టించకోలే..

జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్​ నియోజకవర్గాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.50 లక్షల జనాభాకు తాగునీటిని అందించాలని 2014, మే 23న అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్​ జీవో 69 జారీ చేశారు. అప్పటి కొడంగల్​ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్​రెడ్డి పరిపాలన అనుమతులు కూడా సాధించారు. ఈ స్కీంకు ‘నారాయణపేట– -కొడంగల్’ ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. 

భీమా-–1 కింద ఉన్న భూత్పూర్​ రిజర్వాయర్​ నుంచి నాలుగు దశలుగా ఊట్కూరు, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి లిఫ్ట్​లను చేపట్టాలని నిర్ణయించారు. వీటితో చెరువులను నింపాలని ప్లాన్​ చేశారు. రూ.1,450 కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ పదేండ్లుగా ఈ జీవోను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కొడంగల్  సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడి ప్రజలు జీవో అమలుపై ఆశలు పెట్టుకున్నారు.

మళ్లీ వలసే దిక్కయ్యేట్లుంది..

నాకు సంగన్​ చెరువు కింద ఆరెకరాల భూమి ఉంది. ఈ సారి వర్షాలు లేక చెరువు నిండలేదు. అప్పు చేసి మూడు సార్లు బోర్లు వేయించినా నీళ్లు పడలే. చెరువు నిండక, బోర్లు పడక మళ్లీ వలసే దిక్కయ్యేట్లుంది.

 శివ కుమార్, రైతు, మద్దూరు

చెరువులు నిండితేనే సాగు..

నారాయణపేట జిల్లాలో వర్షాలు పడి చెరువులు నిండితేనే రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి ఉంది. వర్షాలు బాగా పడితే ఒక పంటకు సాగునీరు అందుతుంది. రెండో పంటకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం జీవో 69ని అమలు చేసి జిల్లాలోని మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, మద్దూర్, ధన్వాడ మండలాల్లోని చెరువులను కృష్ణా జలాలతో నింపాలి.   

హెచ్  నర్సింహా, జీవో 69 అమలు కో కన్వీనర్