
- కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపిన సీఎం సభ
- గ్రాడ్యుయేట్, నిరుద్యోగులు, టీచర్ల సమస్యలు గుర్తెరిగిన అభ్యర్థిని నిలబెట్టాం
- నరేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపు
- ప్రతిపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో చురకలు
- నిజాంసాగర్ ప్రాజెక్టు, నిరంతర కరెంట్‌తో జిల్లాలో సాగు పెరిగింది
- ఇక్కడి రైతన్నలు చైతన్యవంతులని కితాబు
- ఆద్యంతం ఆసక్తిగా సాగిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ సక్సెస్ అయ్యింది. సీఎం రాక కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపగా, విద్యావంతుల్లో ఆలోచన రేకెత్తించింది. మధ్యాహ్నం 1.35 గంటల నుంచి 2.25 వరకు సీఎం ప్రసంగం ఆసక్తిగా కొనసాగింది. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ తనదైన శైలిలో చురకలు అంటించారు. కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలో చెబుతూ తన సర్కారు హయాంలో చేసిన ప్రతి పనికి సంబంధించిన లెక్కలు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. గ్రాడ్యుయేట్, నిరుద్యోగులు, టీచర్ల సమస్యలు గుర్తెరిగిన అభ్యర్థి నరేందర్‌రెడ్డిని నిలబెట్టామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు, నిరంతర కరెంట్‌తో జిల్లాలో సాగు పెరిగిందని, నిజామాబాద్ జిల్లా రైతులు చైతన్యవంతులని కితాబునిచ్చారు. వ్యవసాయ సమస్యలపై గవర్నమెంట్‌ను వణికించి సాధించే పంజాబ్, హరియానా రైతన్నల స్ఫూర్తి ఇందూర్లో చూశానని, ఆర్మూర్‌లో జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న తరువాతే టీపీసీసీ ప్రెసిడెంట్బాధ్యతలు చేపట్టి సీఎం దాకా ఎదిగానన్నారు. ఎస్సారెస్పీ నిర్మించిన కాంగ్రెస్ గవర్నమెంట్ గుత్ప, అలీసాగర్ స్కీంల ఏర్పాటుతో జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు, నిరంతర ఉచిత విద్యుత్‌తో జిల్లాలో సాగు పెరిగిందన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. జిల్లాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్జరీన్కు గ్రూప్-1స్థాయి డీఎస్పీ జాబ్ ఇచ్చి గౌరవించామని, రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశామన్నారు.
ఎన్ని లక్షల ఖాళీలున్నా భర్తీ చేస్తం..
ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, నిరుద్యోగులఆశలన్నీ ఆవిరయ్యాయన్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి తరువాత విజన్‌తో పాటు తపన , పట్టుదల ఉన్న మహానేత రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను క్లోజ్ చేస్తున్నదని విమర్శించారు. అదానీ, అంబానీల కోసం కేంద్రం పనిచేస్తుందని, కేంద్రం ఇచ్చిన సున్నా బడ్జెట్‌పై రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు సైలెంట్ గా ఉండడం సరికాదన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్
రాళ్లను పూలుగా మారుస్తున్న కార్యకర్తలు..
ఆంధ్ర కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తెలంగాణ ఎదుగుతున్నదని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి అన్నారు. ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా తనపై రాళ్లు విసురుతుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు పూలుగా మారుస్తున్నారని తెలిపారు. తెలంగాణ వర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. కాలేజీలకు బకాయి పడ్డ స్టూడెంట్ స్కాలర్షిప్లు మూడు నెలల్లో అందించాలని, ఉర్దూ గర్స్ కాలేజీని కొత్త బిల్డింగ్‌లోని మార్చాలని కోరారు.
కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, గవర్నమెంట్ సలహాదారుడు షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, తాహెర్, ఈరవత్రీ అనీల్, అన్వేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, నుడా చైర్మన్ కేశవేణు, లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నర్సారెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.