రేవంత్.. ఏడాదిలో సాధించిందేమీ లేదు

  • బీజేపీ ఎంపీ లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తి కావొస్తోందని, ఈ ఏడాది కాలంలో ఆయన సాధించిందేమీ లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో సుమారు వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో గోషామహల్​కు చెందిన బీఆర్ఎస్ నేత పురుషోత్తం తన అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేసేందుకు బీజేపీ ఏడాది గడువు ఇచ్చిందన్నారు. అయినా, ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు తదితర హామీలపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.