- పక్క రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంతోనే పోటీ
- పదేండ్లలో ట్రిలియన్ డాలర్ల తెలంగాణే సంకల్పం
- మా చిత్తశుద్ధికి ఫ్యూచర్ సిటీ అభివృద్ధే నిదర్శనం
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాళ్ల భద్రతకు మాదీ గ్యారంటీ
- తెలంగాణను సాధించిన యువశక్తి.. రాష్ట్ర ప్రగతిలోనూ ముందుంటది
- అమెరికా, దక్షిణ కొరియా టూర్లో రూ. 31,500 కోట్ల పెట్టుబడులు
- త్వరలో ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
- కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, భద్రత కల్పించే గ్యారంటీ తమది అని పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి రాష్ట్రంలో ఉందని తెలిపారు. తెలంగాణను సాధించిన యువశక్తి.. రాష్ట్ర ప్రగతిలోనూ ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం దేశంలో మరెక్కడా లేదని, పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అని తెలిపారు.
పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నుంచి ప్రపంచంతో పోటీ పడేందుకు తమ ఆలోచనను ఎప్పుడో విస్తరించుకున్నామని చెప్పారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధే నిరూపిస్తుందని ఆయన అన్నారు. ‘‘రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యన సెమీ-అర్బన్ ఏరియా. ఇందులో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజినల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అక్కడ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తాం” అని వివరించారు. కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వచ్చినా వారికి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి భేషజాలకు పోవొద్దని.. పర్మిషన్లు, వసతులను ప్రభుత్వం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి రూ. 31,500 కోట్ల పెట్టుబడులు
అమెరికా, దక్షిణ కొరియాల్లో పది రోజుల పర్యటన తర్వాత తాను ఉదయమే తిరిగి వచ్చానని, ఆయా దేశాల్లో తాము కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తమ పర్యటనల ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు.. 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు.
పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏపీలో ప్రభుత్వం మారగానే తెలంగాణ నుంచి పెట్టుబడులు ఏపీకి పోతాయని ప్రచారం జరిగింది. మా పోటీ ఏపీ, కర్నాటక, తమిళనాడుతో కాదు. ప్రపంచంతోనే పోటీ. హైదరాబాద్ నగరం మా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నది.
ప్రపంచ అవసరాలు తీర్చేందుకే ఫోర్త్ సిటీని డిజైన్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో.. దేశంలో ఎవరి దగ్గర ఇలాంటి హైదరాబాద్ లేదు.. ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్డు లేదు.. ఇలాంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లేదు. పైగా శాంతి భద్రతలు, మంచి వాతావరణం హైదరాబాద్ సొంతం. ఇక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది” అని వివరించారు. పదేండ్లలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలనేది తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.
‘‘రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండాలని, పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధానం ఉండాలని మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది. అందుకే ప్రభుత్వం మారినా విధానాల్లో మార్పు లేదు. ఇంకా వేగంగా, పారదర్శకంగా, పట్టుదలతో మా ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నది” అని చెప్పారు.
త్వరలోనే ఏఐ గ్లోబల్ కాన్ఫరెన్స్: మంత్రి శ్రీధర్ బాబు
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘‘ఒక్క రోజులోనే ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందలేదు. 1992లో నాటి కాంగ్రెస్ సీఎం ఐటీ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తే.. తర్వాత చంద్రబాబు నాయుడు , రాజశేఖర్ రెడ్డి, ఇతర సీఎంలు ఇక్కడ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేశారు” అని తెలిపారు. దావోస్ పర్యటనలో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కాగ్నిజెంట్ అమెరికన్ ప్రెసిడెంట్, ఈవీపీ సూర్య గుమ్మడితో క్యాంపస్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని ఆయన గుర్తుచేశారు.
ఇందుకు స్పందించి ఆరు నెలల కాలంలోనే ఇక్కడ క్యాంపస్ విస్తరణ పూర్తి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కంపెనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రపంచం ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ వంటి విభిన్న రకాల ప్రతిభను అన్వేషిస్తోందని.. అందుకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి అన్ని రకాల వసతులను కల్పించేందుకు తమ సీఎం దృష్టిసారించారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాము ఏఐ సిటీ నిర్మించాలనుకుంటున్నామని.. త్వరలోనే ఏఐ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ మాకు కీలకమైన హబ్: సూర్య గుమ్మడి
తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కీలకమైన హబ్ అని కాగ్నిజెంట్ ఈవీపీ, కాగ్నిజెంట్ అమెరికన్ ప్రెసి డెంట్ సూర్య గుమ్మడి అన్నారు. ‘‘2002 నుంచి కాగ్నిజెంట్ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్‌లో నూతన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.46 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో భారతదేశంలో 2.40 లక్షల మంది, వారిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు.
ఇందులో 39 శాతం మంది మహిళలే” అని తెలిపారు. స్థానికంగా ప్రతిభావంతులైన యువతకు ఉపాధి కల్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, ఐవోటీలో కట్టింగ్ ఎడ్జ్ సమస్యలకు తమ హైదరాబాద్ కేంద్రం పరిష్కారం చూపిస్తుందని సూర్య వెల్లడించారు. రాష్ట్రంలో విద్యా, నైపుణ్య శిక్షణ, సమాజ సంక్షేమం, పర్యావరణ సుస్థిరాభివృద్ధికి తాము కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ పాల్గొన్నారు.
మా చిత్తశుద్ధిని ఫ్యూచర్ సిటీ చూపిస్తుంది
430 ఏండ్ల చరిత్ర హైదరాబాద్ కు ఉందని, నగర స్థాపకుడు కులీకుతుబ్ షా నుంచి తన వరకు ఎవరు పాలించినా, ఎన్ని వ్యవస్థలు మారినా విధానాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘1992లో ఐటీ పరిశ్రమలకు నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే.. ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి సైబరాబాద్‌ను నిర్మించారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు మేం నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం.
చైనా ప్లస్ 1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా ఇతర దేశాలు ఏవైతే ఎదురుచూస్తున్నాయో... వాటన్నింటి ప్రశ్నలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెప్తుంది” అని ఆయన అన్నారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధే నిరూపిస్తుందని పేర్కొన్నారు. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.
హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచలంచెలుగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందదని పేర్కొన్నారు. 2002లో హైదరాబాద్ లో ప్రారంభమైన కాగ్నిజెంట్ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదిగిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలోనూ కాగ్నిజెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
మా పోటీ ఏపీ, కర్నాటక, తమిళనాడుతో కాదు. ప్రపంచంతోనే పోటీ. హైదరాబాద్ నగరం మా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడాలను కుంటున్నది. ప్రపంచ అవసరాలు తీర్చేందుకే ఫోర్త్ సిటీని డిజైన్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో.. దేశంలో ఎవరి దగ్గర ఇలాంటి హైదరాబాద్ లేదు.. ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్డు లేదు.. ఇలాంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లేదు. పైగా శాంతి భద్రతలు, మంచి వాతావరణం హైదరాబాద్ సొంతం. ఇక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది.
- సీఎం రేవంత్