- దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను స్టడీ చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి
- డెస్టినేషన్ వెడ్డింగ్ లకు అనువైన ప్రదేశాల గుర్తింపు.. అభివృద్ధి
- టూరిజం స్థలాలు, లీజు లపై రిపోర్ట్ ఇవ్వండి
- టూరిజం పాలసీపై అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31లోగా తెలంగాణ కొత్త టూరిజం పాలసీని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అద్భుతమైన టూరిజం పాలసీని తెచ్చేందుకు దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను స్టడీ చేయాలని సూచించారు. టూరిజం పాలసీపై జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న టూరిజం పాలసీ లను అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గత పదేండ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని.. అధికారులు రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపైన దృష్టి సారించాలని సూచించారు.
దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుందని దానికి అనుగుణంగా టూరిజన్ని డెవలప్ చేయాలని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపైనా స్టడీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఎయిర్ ఫోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత పెరిగినందుకు దానికి అనుగుణంగా ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని.. ఎయిర్ ఫోర్ట్ నుంచి మూడు గంటల్లో తెలంగాణలో ఎక్కడికైనా చేరుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, గ్రామీణ రోడ్లు బాగున్నాయని.. అన్ని రకాల ఆహారం దొరుకుతుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై స్టడీ చేయాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని ఖాళీ చేయించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ లో నూతన టూరిజం పాలసీని ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చ జరిగేలా చూద్దామన్నారు. సొంత కాళ్ల పైన నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణాన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులను పెరిగేలా చూడాలని.. టైగర్ రిజర్వు ఫారెస్ట్ లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని సూచించారు.
కోర్టుల్లో స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి
పర్యాటక శాఖ స్థలాల లీజులపైన సీఎం అడిగి తెలుసుకున్నారు. టూరిజం స్థలాలు, లీజులపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసుల్లో స్టే లు ఎత్తివేసేలా సీరియస్‌గా ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ తో చర్చించి మంచి న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు పర్యటక స్థలాలు లీజ్ కు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాశ్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.