- ప్రజాపాలనపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన- విజయోత్సవాల సభలను 3 జిల్లాల్లో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 19న వరంగల్‌లో విజయోత్సవ సభ నిర్వహించనుండగా.. అక్కడి నుంచే 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియెట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్కు సంబంధించి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు.
విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటానని సీఎం తెలిపారు. డిసెంబర్ 7, 8, 9న హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటేరియెట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. శాఖలు, విభాగాల వారీగా ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.