- అనుమతులు తీసుకున్నమండపాలకు ఉచిత విద్యుత్
- అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో సాగాలి
- గణేశ్ ఉత్సవాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. ‘‘సెప్టెంబరు16న మిలాద్ ఉన్ నబీ ఉంది. ఆ మరుసటి రోజు17న వివిధ రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడతాయి. అదే రోజున నిమజ్జనం కూడా ఉంటుంది. అందువల్ల అన్ని కార్యక్రమాలపై సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించాలి” అని సీఎం సూచించారు.
గణేశ్ ఉత్సవాల నిర్వహణపై గురువారం సాయంత్రం సెక్రటేరియెట్ లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాల్లో మండప నిర్వాహకులు బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. అనుమతులు తీసుకుని మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, ముందుగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Also Read:-మా బిడ్డకు ఏమైందో చెప్పండి ప్లీజ్
మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అనుమతులు తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. కాగా, గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు అంతకుముందు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. సమీక్షా సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.