SC Classification: ఎస్సీ వర్గీకరణపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు

SC Classification: ఎస్సీ వర్గీకరణపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్మెన్ కమిషన్  రిపోర్ట్ సమర్పించాలని సీఎం ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎం  ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ALSO READ | పదేళ్లలో మీరిచ్చిన ఉద్యోగాలెన్ని.?.. కేటీఆర్కు పొన్నం కౌంటర్

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అణగారిన ఎస్సీ, ఎస్టీల్లోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లలో సబ్ కోటా కల్పించేందుకు ఉప వర్గీకరణ చేపట్టవచ్చని తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని వెల్లడించింది.

అయితే రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయాల్సి వస్తే, అందుకు అవసరమైన డేటాను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతే తప్ప ఇష్టానుసారంగా, రాజకీయ ప్రయోజనాల కోసం వర్గీకరణ చేపట్టకూడదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వర్గీకరణ న్యాయ సమీక్షకు అనుకూలంగా ఉండాలని పేర్కొంది. ఈ తీర్పును అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి గైడ్ లైన్స్ రూపొందించుకోవాలని సూచించింది.