హైదరాబాద్: హైదరాబాద్ ఉత్తర భాగంలో ఉంటున్న నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైజ్-మేడ్చల్ (23 కిలోమీటర్లు); జేబీఎస్-శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 'బి'లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. జనవరి 1, 2024న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్ బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. అదే విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్‌కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని సీఎం రేవంత్‌కు మెట్రో ఎండీ వివరించారు.
గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా పనిచేసిన తనకు ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ చెప్పారు. అయినా రూట్ మ్యాప్ గురించి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు.
డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు ఎండీ చెప్పారు. మెట్రో ఫేజ్-2 'ఏ' భాగం లాగే 'బి' భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల రూపకల్పన మొదలుపెట్టినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.