ప్రజలకి భారంగా మారుతున్న ఇసుక రేట్లు .. ట్రాక్టర్ ఇసుక(3 టన్నులు) రూ.1800కు అమ్మేవారు.. ఇప్పుడు ఏకంగా..

ప్రజలకి భారంగా మారుతున్న ఇసుక రేట్లు .. ట్రాక్టర్ ఇసుక(3 టన్నులు) రూ.1800కు అమ్మేవారు.. ఇప్పుడు ఏకంగా..
  • అనుమతులు లేకున్నా అడ్డగోలుగా తవ్వకాలు 
  • దొడ్డి దారిన అక్రమ రవాణా
  • పరోక్షంగా సహకరిస్తున్న కొందరు అధికారులు

యాదాద్రి, వెలుగు : అక్రమ వ్యాపారులకు ఇసుక కాసులు కురిపిస్తోంది. సిండికేటుగా మారిన వ్యాపారులు బంగారం రేటు పెరిగినట్టుగా రోజురోజుకూ పెంచేస్తున్నారు. అనుమతులు లేకున్నా దొడ్డిదారిన రవాణా జరుగుతోంది. దాడులు చేస్తున్నా దందా ఆగడం లేదు. దాడుల సాకుతో రింగైన ట్రాక్టర్ల ఓనర్లు ఇసుక రేటును వంద శాతం పెంచేశారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. అయినా కొందరు పోలీసులు, రెవెన్యూ స్టాఫ్​పరోక్ష సహకారంతో దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తక్కువ ధరకు ఇసుక అందించేలా చర్యలు..

జిల్లాలోని ఆలేరు, బిక్కేరు తదితర వాగుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ఇండ్ల నిర్మాణం, గవర్నమెంట్​ డెవలప్​మెంట్​వర్క్స్​పేరుతో ఇసుక తవ్వేస్తున్నారు. రూల్స్ ప్రకారం ఇసుక కోసం ఇంటి యజమాని పేరుతో అనుమతి తీసుకుంటే ఒక్కో ట్రాక్టర్​కు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మార్కెట్​లో మాత్రం డిమాండ్​బట్టి రూ.1800 వరకు వసూళ్లు చేస్తున్నారు. అదే ట్రాక్టర్ సన్న ఇసుకకు రూ.3 వేలకుపైగా తీసుకునేవారు. ఇండ్ల నిర్మాణం పేరుతో అనుమతి తీసుకున్న ట్రిప్పులకు అదనంగా ఇసుకను తరలించడం పరిపాటిగా మారింది. వాగుల నుంచి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తుండడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందిస్తామని సర్కారు ప్రకటించింది. సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక అందించేలా చర్యలు తీసుకోనుంది. 

పరోక్ష సహకారం..

ఇసుక అక్రమ రవాణాకు పోలీస్, రెవెన్యూ డిపార్ట్​మెంట్లకు చెందిన కొందరు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకున్నా వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్​ఓనర్ల నుంచి కొందరు నెలవారి మామూళ్లు తీసుకుంటూ సహకరిస్తున్నట్లు సమాచారం. 

వంద శాతానికి రేటు పెంపు..

సీఎం ఆదేశాల నేపథ్యంలో కొన్నిచోట్ల వాగుల నుంచి ఇసుక తరలింపునకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిణామాన్ని ట్రాక్టర్ల ఓనర్లు ఆసరాగా తీసుకుంటున్నారు. అనుమతులు ఇవ్వకున్నా ఇసుక తరలింపు మాత్రం ఆగడం లేదు. పైగా అనుమతులు లేవన్న పేరుతో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రేట్​ను డబుల్​చేసేశారు. 

ఇటీవల రూ.1800కు ట్రాక్టర్ ​ఇసుక(3 టన్నులు) అమ్మేవారు, ఇప్పుడు ఏకంగా రూ.3500 కు పెంచేశారు. కాళేశ్వరం నుంచి తరలించే ఇసుకపై ఇటీవల కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎక్కువ టన్నులు తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించేవారు. ఇటీవల ఓవర్ లోడ్​పై కఠినంగా వ్యవహరిస్తూ జరిమానా విధిస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.