సీఎం రేవంత్​రెడ్డికి రైతులపై ప్రేమలేదు

సీఎం రేవంత్​రెడ్డికి రైతులపై ప్రేమలేదు
  •     రైతు సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నేతలు 
  •     కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా 
  •     బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి 

నెట్​వర్క్​, వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సర్కారుకు ముందుచూపు లేకపోవడంవల్లనే పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు. బీజేపీ కిసాన్​ మోర్చా పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాపంగా బీజేపీ రైతు దీక్ష నిర్వహించింది. నిర్మల్​లో ఏలేటి మహేశ్వర్​రెడ్డి, నారాయణపేటలో డీకే అరుణ, మెదక్​లో రఘునందనరావు, నిజామాబాద్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా సాగునీరు, విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మహేశ్వర్​రెడ్డి అన్నారు. 

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రూ. 500 బోనస్, రూ. 15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు రూ. 12 వేల సాయం హామీలను అమలు చేయలేదన్నారు. హామీలను విస్మరించిన ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని, హామీలు అమలు చేసిన తర్వాతనే లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుచుకుంటే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

హామీలనుంచి పారిపోతున్నరు :  డీకే అరుణ

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్​నగర్​ లోక్​సభ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. పాలన చేతకాక కాంగ్రెస్​ ఆరు గ్యారంటీల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్​కు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. గత ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిసి, సాధ్యం కాని హామీలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. 

కాంగ్రెస్​అంటేనే మోసం :  రఘునందన్​ రావు

కాంగ్రెస్​కు నోట్లు, ఓట్లు, సీట్ల మీద తప్ప రైతులపట్ల శ్రద్ధ లేదని మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. ఎలక్షన్​ కోడ్​ సాకుతో బోనస్​ఎగవేయాలని చూస్తున్నారన్నారు. కరెంట్​ కోతలు, నీటి తడులు అందక పొలాలు ఎండిపోతున్నాయన్నారు. ప్రజలను మోసం చేయడంలో రేవంత్​రెడ్డి.. కేసీఆర్​ను మించిపోయాడన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ను రాష్ట్రంలో ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. 

ప్రజలను, రైతులను కాపాడేది మోదీ సర్కారేనని, మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మెదక్​ జిల్లా ఇన్‌‌చార్జి కలెక్టర్​గా ఉన్న సమయంలో బీఆర్​ఎస్​ క్యాండిడేట్​ వెంకట్‌‌రామిరెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఆయన కల్లబొల్లి మాటలకు ప్రజలు మోసపోరని అన్నారు. తాను మాట్లాడినా, విమర్శలు చేసినా బీఆర్​ఎస్​ వారు నోటీసులు ఇస్తున్నారని, వాటికి భయపడేది లేదన్నారు.