- మొదలైన సూరమ్మ ప్రాజెక్ట్ పనులు
- వైఎస్ హయాంలో నిర్ణయం.. తర్వాత పట్టించుకోని బీఆర్‌ఎస్
- కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రాజెక్ట్‌కు మోక్షం
- రూ. 350 కోట్లు కేటాయింపు.. మేలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు
- 43 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ పనులు ఎట్టకేలకు మొదలుకావడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏండ్ల కింద కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంగా వదిలేసింది. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్ట్ పనులకు మోక్షం లభించింది. రెండు రోజుల కింద ప్రారంభమైన పనులను వచ్చే ఏడాది మే లోపు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయితే సుమారు 43 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
వైఎస్ హయాంలోనే నిర్ణయం
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట గ్రామ శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే చుట్టుపక్కల ఉన్న కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లోని 43 గ్రామాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ పనులకు వైఎస్సార్ హయాంలోనే శ్రీకారం చుట్టారు. ఎల్లంపల్లి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు నీటిని తరలించి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు 650 ఎకరాల భూమిని సైతం సేకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ. 204 కోట్లతో కాల్వల నిర్మాణానికి 2016 జూన్ 22న అప్పటి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. కానీ తర్వాత నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
కాంగ్రెస్ హయాంలోనే పునఃప్రారంభం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్ సూరమ్మ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్‌లో భాగంగా ఆఫీసర్లు సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనుల రీసర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందచేశారు. దీంతో సర్కార్ ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.350 కోట్లుగా నిర్ణయించారు. చెరువు గతంలో 150 ఎంసీఎఫ్‌టీగా ఉండగా, దానిని 450 ఎంసీఎఫ్‌టీకి పెంచనున్నారు.
కుడి, ఎడమ కాల్వలకు భూసేకరణ
కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి 526 ఎకరాల భూ సేకరణ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చిలోగా రిజర్వాయర్ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మే నెలలోగా పూర్తవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రాజెక్ట్ పనులను జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
మత్తడి, కట్ట పనులు ప్రారంభయ్యాయి
ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ పనుల్లో భాగంగా కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు చేపట్టాం. రాష్ట్రంలోని 19 ప్రయార్టీ ప్రాజెక్టుల్లో ఈ చెరువు కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టేజ్ 1, 2, 3 పనులకుగాను, రూ.350 కోట్ల నిధులు కేటాయించగా, ప్రస్తుతం మత్తడి, కట్ట పనులు మొదలయ్యాయి.
సంతు ప్రకాశ్, ఈఈ కలికోట సూరమ్మ ప్రాజెక్ట్