హైదరాబాద్​ తాగునీటి కోసం 20 టీఎంసీలు

హైదరాబాద్​ తాగునీటి కోసం 20 టీఎంసీలు
  • కొండపోచమ్మ సాగర్​, మల్లన్నసాగర్​లోని నీటి లభ్యత, ఖర్చుపై రిపోర్ట్​ రెడీ చేయండి
  • వచ్చే నెల 1న టెండర్లకు సిద్ధంగా ఉండండి
  • అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​కు 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించేందుకు సమగ్ర నివేదిక రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఇదే అంశంపై శనివారం జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో ఇరిగేషన్, జలమండలి అధికారులతో ఆయన సమీక్షించారు. కొండపోచమ్మ సాగర్  లేదా మల్లన్న సాగర్  నుంచి నీటిని తరలించేందుకు ప్రాజెక్టుల్లోని నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం ఎంత ఖర్చవుతుందనే అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలన్నారు.
 
వచ్చే నెల 1 నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి 2 టీఎంసీల నీళ్లను కూడా తీసుకోనున్నారు. ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్​లోని జంట జలాశయాలకు నీటిని తరలించేందుకు ట్రంక్​ పైప్​లైన్లు వినియోగించనున్నారు. 
 
పంప్​హౌస్​లు, పంప్​లు, 2,400 ఎంఎం పైప్​లైన్​ (దాదాపు 40 కిలో మీటర్లు) ఘన్​పూర్​ నుంచి ముత్తంగి.. ఘన్​పూర్​ నుంచి ఉస్మాన్​ సాగర్ వరకు వేయనున్నారు. వీటన్నింటికీ కలిపితే రూ.4,300 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, జలమండలి ఎండీ అశోక్​ రెడ్డి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ప్రశాంత్ జె.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.