కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి తెచ్చిందేంది?: సీఎం రేవంత్రెడ్డి

కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి తెచ్చిందేంది?: సీఎం రేవంత్రెడ్డి
  • ఏదైనా కొత్త ప్రాజెక్టో, స్పెషల్​ ఫండ్సో తెచ్చిండా?: సీఎం రేవంత్​
  • మూసీ వద్దంటున్నడు.. మెట్రోకు అడ్డుపడ్తున్నడు.. సైంధవ పాత్ర పోషిస్తున్నడు
  • ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు
  • డీలిమిటేషన్​ పేరుతో దక్షిణాదికి అన్యాయం..  బీజేపీ కుట్రలను ఎదుర్కొంటం 
  • మార్చి 10 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడి
  • పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి: కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​

హైదరాబాద్, వెలుగు:కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని సీఎం రేవంత్​రెడ్డి సవాల్​ చేశారు. తాము మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే  కేంద్రాన్ని అడుగుతున్నామని అన్నారు. కానీ మోదీ తన గుజరాత్ నుంచి ఇక్కడికి  రైళ్లలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.  

శుక్రవారం గాంధీ భవన్ లో పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్  అక్కడే మీడియా సమావేశంలో మాట్లాడారు.   కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి వందశాతం సైంధవ పాత్ర పోషిస్తున్నారని, ఆయన అడ్డుపడడం వల్లే మెట్రో విస్తరణ ఆగిపోయిందని ఆరోపించారు.  ‘‘తెలంగాణ నుంచి కిషన్​రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. 

ఆ హోదాలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాజెక్టుగానీ, నిధులుగానీ ఏమైనా తెచ్చారా?  ఒక్కరోజైనా ప్రధాని మోదీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి  ఏమైనా అడిగారా? పార్లమెంట్ సమావేశాల్లో ఈ  రాష్ట్రం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ ను మేం ఓడించామని కిషన్ రెడ్డి మా పై  కక్ష పెంచుకున్నారు..  నిధుల గురించి అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ  ఎవరూ లేరు” అని వ్యాఖ్యానించారు. 

మూసీ ప్రక్షాళన వద్దా?

మూసీ అభివృద్ధికి కేంద్రాన్ని తాము నిధులు అడిగితే కిషన్​రెడ్డి అవహేళన చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. సబర్మతి, గంగా, యమునా నదులను వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ.. తాము మూసీని ప్రక్షాళన చేయొద్దా? అని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్ పై ఆనాడు మోదీ స్పష్టమైన ప్రకటన చేసింది నిజం కాదా? అని అడిగారు.  

మెట్రోను కేంద్రమంత్రివర్గ ఎజెండాలో ఎందుకు పెట్టడంలేదని, ఎజెండాలో పెట్టకుండా మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తున్నదని ఎవరని నిలదీశారు. ‘‘తమిళనాడులో మెట్రోకు అనుమతిస్తారు.. కానీ తెలంగాణకు ఇవ్వరు.. కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లే మెట్రోకు అనుమతులు ఇవ్వడంలేదని నేనంటున్నాను. ఎప్పటిలోగా మెట్రోకు అనుమతులు తెస్తారో కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్​చేశారు. 

కులగణనపై విమర్శలా?

బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కుల గణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్​ ఫైర్​ అయ్యారు. కుల గణనలో పాల్గొనాలని కేసీఆర్ ను, కేటీఆర్​ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని నిలదీశారు. కుల గణనపై విమర్శలు చేసేవారు.. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కుల గణనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

‘‘బీజేపీ  కూటమి అధికారంలో ఉన్న పక్క రాష్ట్రంలో ముస్లింలు.. బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న బిహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లోనూ ముస్లింలు.. బీసీ రిజర్వేషన్లు  పొందుతున్నారు.. కానీ  ఇక్కడ బీసీల్లోంచి ముస్లింలను తొలగించాలని అంటున్నారు. ఇక్కడ అడిగే ముందు  అక్కడ ఎందుకు రద్దు చేయించడంలేదు’’ అని రేవంత్​ నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని తాము ఎండగడతామని హెచ్చరించారు. ‘‘మేం ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందా చేయడంలేదు,  రాష్ట్రానికి కావాల్సినవే అడుగుతున్నాం”అని అన్నారు. 

నియోజకవర్గాల పునర్విభజనతో  దక్షిణాదిపై కుట్ర 

నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్​అన్నారు.‘‘దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నది.  దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నది’’ అని మండిపడ్డారు. 

జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాదికి నష్ట కలుగుతుందని,  అందుకే సీట్ల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కోరారు.  దేశంలో బీజేపీ కుట్రలను సాగనివ్వబోమని, వాటిని దీటుగా ఎదుర్కొంటామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని సీఎం చెప్పారు. 

త్వరలో నామినేటెడ్​ పోస్టుల భర్తీ

 రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టులను మార్చి 10 లోగా భర్తీచేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఇన్​చార్జి మంత్రులను సీఎం రేవంత్  ఆదేశించారు. గాంధీ భవన్ లో జరిగిన  పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి  మాట్లాడారు.    మీనాక్షి నటరాజన్ లాంటి వారిని తెలంగాణ  ఇన్​చార్జిగా  నియమించడంపై  సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు అంతా కసితో పనిచేయాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్​ పిలుపునిచ్చారు.  

 నెలకు 5 వేల ఉద్యోగాలిచ్చాం: మహేశ్ గౌడ్

కేసీఆర్ పదేండ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో  ఇచ్చామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. పీసీసీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిననాటినుంచి నెలకు 5 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు.  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జీగా ఇప్పటి వరకు పని చేసిన  దీపాదాస్ మున్షీకి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.  

స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చించినట్లు చెప్పారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ మీద చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామన్నారు. పెండ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్​కు మనస్ఫూర్తిగా పని చేసే మహా నాయకురాలు మీనాక్షి నటరాజన్ అని కొనియాడారు.  

కుల గణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం సామాజిక న్యాయం గురించి మాట్లాడడం ఏమిటని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు.  మనం  అధికారంలోకి వచ్చిననాటి నుంచి చేసిన అభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి:  మీనాక్షి నటరాజన్

‘‘ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. పేదవాళ్ల కోసం పని చేసి వారి ముఖాల్లో నవ్వులు చూడాలి. అప్పుడే మనం పనిచేసినట్లు” అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. రాష్ట్ర ఇన్​చార్జిగా నియామకం తర్వాత శుక్రవారం గాంధీ భవన్​లో మొదటిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉందని, వారు చేసిన అనేక రకాల పోరాటాల వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జోడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో మనం అక్కడ పోరాటం చేయాల్సి ఉంది”అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చిందని, అలాంటి కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని వెల్లడించారు.   

రాష్ట్రంలో సీఎం రేవంత్​ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కుల గణన చేపట్టామని, ఇది చాలా గొప్ప విషయమని కొనియాడారు. కార్యకర్తలు ఫోన్ చేస్తే తాను మాట్లాడుతానని చెప్పారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు పెడితే నాయకులు ఎన్నికల్లో గెలవరని, ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని స్పష్టం చేశారు. “నా కోసం రైల్వే స్టేషన్లకు లీడర్లు ఎవరూ రావొద్దు.. నా బ్యాగ్​లు ఎవరు మోయద్దు, నాకు బలం లేకపోతే నేనే మీ సహాయం అడుగుతా. 

అంతేగానీ మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడా తక్కువ చేసుకోవద్దు. మీరు మీ పని చేసుకోండి” అని పార్టీ నేతలకు హితబోధ చేశారు. అంతకుముందు దిల్ కుశ గెస్ట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమన్నారు. నేతల అభిప్రాయాలకు కాంగ్రెస్​లో సముచితమైన గౌరవం ఉంటుందని చెప్పారు.