పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులివ్వాలి: సీఎం రేవంత్రెడ్డి

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులివ్వాలి: సీఎం రేవంత్రెడ్డి
  • అందుబాటులోకి చర్లపల్లి రైల్వేస్టేషన్​
  • వర్చువల్​గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. పాల్గొన్న సీఎం రేవంత్​
  • పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులివ్వండి
  • మెట్రో రైల్ ఫేజ్ 2ను మంజూరు చేయండి 
  • ట్రిపుల్​ ఆర్​కు అనుసంధానంగా రీజినల్ రింగ్ రైల్ నిర్మాణానికి సహకరించండి 
  • కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే చేపట్టాలి 
  • వికారాబాద్ టు కర్నాటక రైల్వే లైన్ పూర్తి చేయాలి
  • బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే  నిర్మించాలని ప్రధానికి సీఎం రేవంత్​విజ్ఞప్తి

హైదరాబాద్ / సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణకు సంబంధించి పెండింగ్​లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం అవుతారని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌‌గా ప్రారంభించారు. 

ఇందులో భాగంగా చర్లపల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్​గా పాల్గొని.. పెండింగ్​లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను ప్రస్తావించారు. వాటికి అనుమతులు మంజూరు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘చాలా ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినందుకు తెలంగాణ ప్రజల తరఫున  కృతజ్ఞతలు. 

గతంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే చేపట్టాలి. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ లేనందున హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణలో ఫార్మా ఇండస్ట్రీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35% హైదరాబాద్​లోనే తయారవుతున్నాయి. అందువల్ల ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రవాణా సులభమవుతుంది” అని తెలిపారు. 

మెట్రో ఫేజ్ 2తో మరింత అభివృద్ధి.. 

ట్రిపుల్ ఆర్​కు అనుసంధానంగా రీజినల్ రింగ్ రైల్ ను మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ట్రిపుల్ ఆర్ నిర్మిస్తే హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి. మెట్రో రైలు పరంగా దేశంలో ఢిల్లీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉండాల్సింది. 

కానీ గత పదేండ్లలో ఈ దిశగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఫలితంగా తెలంగాణ 9వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మెట్రో రైలు ఫేజ్ 2కు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌‌లో ఉన్నాయి. వాటికి అనుమతులు ఇస్తే హైదరాబాద్ అభివృద్ధికి మరిన్ని బాటలు వేసినట్టు అవుతుంది. తెలంగాణను కర్నాటకతో అనుసంధానం చేసే వికారాబాద్ రైల్వే లైన్ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌‌లో ఉన్నాయి. 

దీన్ని మంజూరు చేయాలి” అని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆటోమొబైల్ పరిశ్రమ ఆసక్తి చూపుతున్నదని, ఎలక్ట్రికల్ తయారీ రంగం కూడా ఇక్కడ అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

శివారు ప్రాంతాలు అభివృద్ధి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  

చర్లపల్లి రైల్వే స్టేషన్​తో హైదరాబాద్ శివారు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడానికి, గూడ్స్ రవాణాకు ఎంతగానో దోహదపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కేటాయించిం దని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయి అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల పద్ధతుల్లో, ఆధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. కవచ్ కొత్త వెర్షన్ తో రైల్వే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. 

రోడ్డు నిర్మాణానికి సహకరిస్తం: శ్రీధర్ బాబు 

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు సహకారం అందజేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చర్లపల్లి స్టేషన్​అప్రోచ్ రోడ్డుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అయితే కేంద్రం కూడా నిధులు విడుదల చేయాలని కోరారు.