92 శాతం కులగణన పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

92 శాతం కులగణన పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
  • రాజ్యాంగ పవిత్రతను కాపాడింది కాంగ్రెస్సే
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అండగా నిలిచాం
  • మోదీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోంది
  • కులగణనపై రాహుల్ పోరాటానికి  మా మద్దతు
  • సంవిధాన్ రక్షణ్ అభియాన్ లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగం పవిత్రతను కాపాడుతు న్నది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. 

రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక్షణ్ అభియాన్ లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క వర్గానికీ  సామాజికి న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. 

ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణలో కులగణన చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 92 శాతం కులగణన పూర్తయిందని వెల్లడించారు. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కాపాడింది కాంగ్రెస్సే అన్నారు.

 కులగణనతో దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు. మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణలో గాంధీ పరివారం ప్రయత్నం చేస్తున్నదన్నారు.

 రాహుల్ గాంధీ వెంటే దేశ ప్రజలు ఉన్నారని చెప్పారు. రాహుల్ చెబుతున్న కులగణన సమాజానికి ఎక్స్ రే మాత్రమే కాదని ఇది సమాజం యొక్క మెగా హెల్త్ చెకప్ అని అన్నారు.

 కులగణన విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.