
- కేసీఆర్, కేటీఆర్‌ను కిషన్‌రెడ్డి, సంజయ్ కాపాడ్తున్నరు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుపడ్తున్నరు: సీఎం రేవంత్
- కేసీఆర్, కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తదనేప్రభాకర్ రావు, శ్రావణ్ రావును అమెరికాలో దాచిన్రు
- ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలే
- ఫామ్‌హౌస్‌లో కూసొని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు
- బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీఅడ్డుపడ్తున్నదని ఫైర్.. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు
నిజామాబాద్ / మంచిర్యాల / కరీంనగర్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అమెరికా పారిపోయారని..వారిని ఇండియాకు రప్పించాలని కేంద్ర హోంశాఖను కోరి పది నెలలైనా స్పందన లేదన్నారు.
వాళ్లిద్దరూ రాష్ట్రానికి వస్తే కేసీఆర్, కేటీఆర్ చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని తెలిసే చీకటి ఒప్పందంలో భాగంగా అమెరికాలోనే దాచిపెడ్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో కూసొని కేసీఆర్ తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, ప్రజలు తిరస్కరించినా ఆయనలో మార్పురాలేదని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ‘‘నేనడుగుతున్న బండి సంజయ్‌ని. కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పారిపోయి అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును పట్టుకరావాలి.
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పనికాదు. కేంద్ర హోంశాఖ చేయాలి. వాళ్ల కోసం రెడ్ కార్నర్ పంపించి 10 నెలలైంది. వాళ్లను ఎందుకు పట్టుకొస్తలేరు” అని నిలదీశారు. ‘‘ఇది మీ చీకటి ఒప్పందంలో భాగం కాదా? వాళ్లను తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్, కేటీఆర్ చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తది. అందుకే ఢిల్లీకి వచ్చి మీ కాళ్లు పట్టుకుంటే వాళ్లను దాచి పెడుతున్నది మీరు కాదా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి నువ్వే కదా.. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును ఎప్పట్లోగా తీసుకొస్తవో చెప్పు. వాళ్లను మాకు అప్పజెప్తే మేం అరెస్టు చేస్తమా లేదా చెప్తం’’ అని రేవంత్ అన్నారు.
‘‘గొర్రెల స్కామ్‌లో కేసు నమోదు చేస్తే ఈడీ వచ్చి పేపర్లు పట్టుకపోయింది. ఫార్ములా–ఈ రేస్‌లో కేసు నమోదు చేస్తే ఈడీ వచ్చి ఆ పేపర్లు కూడా తీసుకపోయింది. మేమేమో కేసులు కట్టాలే.. మీరేమో వాళ్లను చీకట్లో ఢిల్లీకి పిల్చుకొని లెక్కలు సెట్ చేసుకుంటరా? ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల లెక్కలు సెట్ చేసుకున్నరు. ఫార్ములా– ఈ రేస్, గొర్రెల స్కామ్ లను అడ్డంపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా బీఆర్ఎస్తో బీజేపీ ఒప్పందం చేసుకున్నది. మీరు చేస్తున్న పని ప్రజలు గమనిస్తున్నరు’’ అని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణను బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘96 ఏండ్లలో ఎన్నడూ దేశంలో కులగణన జరగలే. పెద్ద బీసీనని చెప్పుకునే మోదీ.. చిన్న బీసీ బండి సంజయ్ 12 ఏండ్లలో బీసీల లెక్కలు తేల్చలే. రాహుల్ గాంధీ మాట మీద నేను 12 నెలలు తిరగకముందే తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నరని లెక్కలు తేల్చిన.
ఈ ఎన్నికల్లో అనుకోనిది ఏమైనా జరిగితే బీసీ లెక్కలు జరిగినందుకే కాంగ్రెస్ ను ఓడించిన్రని తప్పుడు ప్రచారం చేస్తరు. తద్వారా బీసీలకే నష్టం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘బీసీల లెక్కలపై అజ్ఞానంతో మాట్లాడకు బండి సంజయ్! మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్ లో ముస్లిం ఉపకులాలు బీసీల్లో ఉన్నయో లేవో నీ సెక్రటేరియెట్ ఆఫీసర్లను అడుగు.
గుజరాత్ లో 33 ముస్లిం ఉపకులాలు, మహారాష్ట్రలో 26 ముస్లిం ఉపకులాలు బీసీ హోదాలో ఉన్నాయి. మన దగ్గర దూదేకుల, నూర్ భాషా తదితర కులస్తులు ఎప్పటి నుంచో బీసీ కేటగిరీలో ఉన్నారు. ఆ రాష్ట్రాలకు నిజనిర్ధారణ కమిటీలను పంపిద్దాం. దమ్ముంటే ముందుకురావాలి” అని ఆయన సవాల్ చేశారు. 30 ఏండ్లుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని 12 నెలల్లో తమ ప్రభుత్వం పరిష్కరించిందని, 12 ఏండ్లుగా బీజేపీ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని ప్రధాని మోదీపై మంద కృష్ణ, కిషన్‌రెడ్డి ఎందుకు ఒత్తిడి తేవడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
బండి సంజయ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని, దత్తాత్రేయకు ఉన్న సికింద్రాబాద్ ఎంపీ సీటును కిషన్‌రెడ్డి గుంజుకున్నారని.. బీసీల రెండు కుర్చీలు గుంజుకున్న కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. తాను పీసీసీ కుర్చీని బలహీనవర్గాలకు ఇచ్చానని ఆయన తెలిపారు.
ఢిల్లీలో చేసిన మంతనాలేంటి?
‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టిన్రు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో అభ్యర్థి లేడు. వారు పోటీ చేయట్లే. కానీ కేటీఆర్, హారీశ్ రావు కాంగ్రెస్ ను ఓడించాలని చెప్తున్నరు. మంచిదే. మీ కోపం, మీ పగ పట్టభద్రులు అర్థం చేసుకుంటరు. కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నరు? మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు, పార్టీ నాయకులు ఎవరికి ఓటేస్తరు? కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత పట్టభద్రులే. మీరు ఎవరికి ఓటేస్తరో సమాధానం చెప్పాలి.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ ను ఓడించాలని అడుగుతున్నరు. దీని మతలబేందో పట్టభద్రులు అర్థం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటో చెప్పాలి’’ అని సీఎం రేవంత్ నిలదీశారు. ‘‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయిన్రు. 2024 ఎంపీ ఎన్నికల్లో మీరు 8 సీట్లలో డిపాజిట్లు కోల్పోతే బీజేపీ ఆ 8 సీట్లలో గెలిచింది. మీ డిపాజిట్లు పోతయెట్ల.. అవే సీట్లల్ల బీజేపోళ్లు గెలుస్తరెట్ల? మీరు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించిన్రు’’ అని బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలను,8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి తెలంగాణకు వాళ్లు తెచ్చిందేమిటని ప్రశ్నించారు. తమ్మడిహెట్టి ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్ర నుంచి అనుమతైనా తీసుకొచ్చారా అని నిలదీశారు. ‘‘నరేంద్రమోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నడు. ఆ లెక్కన ఇప్పటివరకు పన్నెండేండ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలి. తెలంగాణకు కోటి ఉద్యోగాలు బాకీ పడ్డడు.
కానీ ఆయన ఇచ్చింది రెండే ఉద్యోగాలు. ఒకటి కిషన్ రెడ్డికి, ఇంకోటి బండి సంజయ్ కు. వేలాది మంది పట్టభద్రులకు ఉద్యోగాలు ఇయ్యని బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్లో 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 6 వేలకు పైగా పారామెడికల్ పోస్టులు భర్తీ చేశాం.
వివిధ శాఖల్లో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలిచ్చి వాళ్ల కుటుంబాల్లో ఆనందం చూసిన మాట వాస్తవమైతే కాంగ్రెస్ ను గెలిపించండి’’ అని గ్రాడ్యుయేట్లను కోరారు. 69 వేల కోట్లతోటి రాష్ట్రాన్ని అప్పజెప్పితే కేసీఆర్ రూ.7 లక్షల 11 వేల కోట్లు అప్పుచేశారని ఆయన మండిపడ్డారు. ‘‘కేసీఆర్ చేసిన అప్పుకు ఏడాది లోపల రూ.75 వేల కోట్లు మిత్తి కట్టాల్సి వచ్చింది.
రాష్ట్రాన్ని దివాలా తీయించి పోయి ఫామ్ హౌస్‌లో పండుకున్నడు. నేను మెట్రో రైలు, మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, సీతారామ ఎత్తిపోతలకు నిధుల కోసం మోదీతో కొట్లాడుతుంటే కేసీఆరేమో మోదీ కోసం నా కాలుపట్టి గుంజుతున్నడు. మోదీ, కేసీఆర్ ఒక్కటై మా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలుచేయాలనుకుంటున్నరు’’ అని తెలిపారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన పట్టభద్రులే వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత తీసుకోవాలి.
ఈ ఎన్నికలు పట్టభద్రులవి. ప్రభుత్వానికి, పట్టభద్రులకు అనుసంధానకర్తగా నరేందర్ రెడ్డి ఉంటడు. ఆయనను గెలిపిస్తే ఆదిలాబాద్ కు యూనివర్సిటీ సాధిస్తడు. సమస్యలు తెలిసినవాడు,. సమస్యల్ని పరిష్కరించేవాడు మన ప్రతినిధిగా ఉండాలి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆయా సభల్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంపై కిషన్ రెడ్డి... ఇదేనా నీ నీతి?
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్ మెట్రో రైలు ఎందుకు కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందుతలే. దీనికి అనుమతి ఇవ్వకుండా, కేబినెట్ లో పెట్టకుండా కేంద్ర మంత్రులను బెదిరించింది నువ్వు కాదా? గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోదీ కట్టుకున్నడు. వారణాసిలో నమామి గంగే ప్రాజెక్టు పేరిట వేల కోట్లు ఖర్చుపెట్టిన్రు. యమునా నదిని ప్రక్షాళన చేస్తమని ఢిల్లీ ఎన్నికల్లో చెప్పిన్రు.
కానీ మేం మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే అనుమతి ఇస్తలేరు. కిషన్ రెడ్డి... ఇదేనా నీ నీతి’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘మేము వంద కిలోమీటర్లు మెట్రోను విస్తరిస్తున్నం. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం తెచ్చినవ్. ఇట్ల ఎన్ని రోజులు మభ్యపెడుతవ్. నా మీద కోపముంటే ఉండొచ్చు.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఏం చేసిన్రనీ. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నవ్. నీకు చిత్తశుద్ధి ఉంటే మెట్రో రైలు, మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, నిధులు తీసుకురా’’ అని కిషన్ రెడ్డికి సీఎం సవాల్ విసిరారు.
మోదీపై మంద కృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే?
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా కొట్లాడ్తున్నరు. మందకృష్ణ వెళ్లి మోదీని కౌగిలించుకున్నడు. మోదీ మంద కృష్ణను ముద్దు పెట్టుకున్నడు. మరి పార్లమెంట్లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడ్తలే? ఇందుకోసం మోదీపై మంద కృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? మేం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడ్తున్నరు. 12 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తరా? 12 ఏండ్లు మోసం చేసిన బీజేపీకి ఓటేస్తరా? ఓటర్లు తేల్చుకోవాలి. - సీఎం రేవంత్రెడ్డి
15 మంది బీసీలను పీసీసీ చీఫ్‌లను చేసిన ఘనత కాంగ్రెస్ ది
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నం. అధికారంలోకి రాగానే ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తీసివేస్తే ఎవరు అడగలేదు. కానీ సుమారు15 మంది బీసీలను పీసీసీ అధ్యక్షులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
- పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్
నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య కేంద్రాలు
పట్టభద్రులకు సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నం. భవిష్యత్ లో యువతకు బంగారు బాటలు వేసేందుకు, ఉద్యోగ అవకా శాలు కల్పిస్తం. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని 13 నియోజకవర్గ కేంద్రాల్లో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటం. కాలేజీలు స్థాపించి అనేక మందిని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టాం.
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
రేవంత్ రెడ్డి చేతులకు బలాన్నివ్వండి
గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు నింపిన విధానం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తు పెట్టుకోవాలి. 11 వేల టీచర్ పోస్టు లు భర్తీ చేసిన విధానం మర్చి పోవద్దు. రేవంత్ రెడ్డి చేతులకు బలాన్నివ్వండి. మరింత వేగంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని గ్రాడ్యుయేట్లకు హామీ ఇస్తున్నం. ఫస్ట్ తారీఖునే ఉద్యోగులకు జీతాలిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న.
- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్
సమస్యలను పరిష్కరించేందుకు నరేందర్ రెడ్డిని పంపండి
ఆనాడు ప్రశ్నించే గొంతుకగా జీవన్ రెడ్డి అవసరమయ్యారు. ఈ రోజు ప్రజా పాలనలో సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించి మండలికి పంపాల్సిన అవసరం ఉంది. 15 నెలల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ముందుకుపోతున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్న. నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.
- మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ఎమ్మెల్సీ ఎన్నిక కేంద్రానికి హెచ్చరిక కావాలి
హామీలు అమలు చేయడానికి ఇంకా నాలుగేండ్ల టైముంది. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వచ్చినయి. టీజీ పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. జాబ్ క్యాలెంబర్ ప్రకటించారు. బీసీల అభ్యున్నతి కోసం కులగణన జరుగుతున్నది. కేంద్రానికి ఒక హెచ్చరిక జారీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలాన్నివ్వాల్సిన అవసరం ఉంది.
- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం