హైదరాబాద్: అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. సభలో బీఆర్ ఎస్ సభ్యులు హరీష్ రావు చేసినవ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటరిచ్చారు. హరీష్ రావు మరోసారి సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారని అన్నారు.
వాళ్లు చేసిన దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థ మెడ మీద కత్తి వేలాడుతోందన్నారు. ఒప్పందాలు అమలు చేయకపోతే అగ్రిమెంట్ ఉల్లంఘించినందుకు కేంద్రం తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. విధిలేని పరిస్థితుల్లోస్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అన్నారు.
లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ బఠానీలు అమ్మినట్లు 7వేల కోట్లకు అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొర్రెల పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఏసీబీ అధికారులు మీదమీద తనిఖీలు చేస్తేనే.. రూ. 700 కోట్లు అవినీతి జరిగిందని తేలింది. కేసీఆర్ కిట్ లో కూడా అవినీతి జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ ఎస్ నేతలు కోరుకుంటే విచారణ జరిపిస్తామన్నారు.
బీఆర్ ఎస్ గొప్ప పథకం అని చెప్పుకుంటున్న బతుకమ్మ చీరల పథకంలో కూడా కోట్లు మింగారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇన్ని తప్పులు చేసిన బీఆర్ ఎస్ నేతలు వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.