మల్కాజ్గిరిలో నా గెలుపుతోనే కేసీఆర్ పతనం మొదలైంది: సీఎం రేవంత్రెడ్డి

మల్కాజ్గిరిలో నా గెలుపుతోనే కేసీఆర్ పతనం మొదలైంది: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: 2024 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి తన గెలుపు.. తెలంగాణ రాష్ట్రానికి సీఎం చేసిందన్నారు రేవంత్రెడ్డి. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మాల్కాజ్ గిరి అన్నారు. 2వేల 964 బూత్ లలో ప్రతి బూత్ సైనికుళ్లా కార్యకర్తలు పనిచేశారన్నారు. మల్కాజ్ గిరి నుంచి తన గెలుపుతోనే కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలిచేలా కృషి చేయాలన్నారు. 

అధికారంలోకి వచ్చిన మొదటి వందరోజులు పాలనపై దృష్టి సారించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. గృహలక్ష్మీ పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ :- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ - సీట్లు, మ్యానిఫెస్టోకు తుది మెరుగులు..

మల్కాజ్ గిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంఖుస్థాపన చేసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో, ఎంఎం టీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా.. కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్టు గెలిచినా.. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే గానీ..  అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదన్నారు. అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో  కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.