
- మా పోటీ బీజేపీతోనే..రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది
- మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
- సీబీఐ కేసులు చూపి బీఆర్ఎస్నువిలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్
- ఎస్‌ఎల్‌బీసీ ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం
- కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నడు.. ప్రాజెక్ట్‌లు రాకుండా అడ్డుకుంటున్నడు
- కాళేశ్వరంపై కేసు పెట్టిన రాజలింగమూర్తి, అడ్వకేట్ సంజీవరెడ్డి మృతిపై కేటీఆర్ మౌనమెందుకు?
- డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మరణం వెనుక కారణాలేమిటి?
- ఈ మూడు మిస్టరీ మరణాలపై ఫిర్యాదు వస్తే తప్పక దర్యాప్తు చేస్తం
- ఫిరాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడటం పెద్ద జోక్
- బీఆర్ఎస్ హయాంలో రాని బై ఎలక్షన్స్ ఇప్పుడొస్తయా? అని ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు:తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రధాన పోటీ బీజేపీతోనేనని ఆయన స్పష్టం చేశారు. ‘‘బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎవరొచ్చినా భవిష్యత్తులో ఆ పార్టీతోనే మాకు పోటీ ఉంటుంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ డిమాండ్ చేయడం వెనుక కుట్ర ఉంది.
సీబీఐ విచారణ పేరుతో బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది” అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయన్ను దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని చెప్పారు. ఫార్ములా–ఈ రేసు కేసులో ఈడీ దర్యాప్తు జరుపుతున్నదని, మరి కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈడీ దర్యాప్తుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం తుగ్లక్ రోడ్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తాము ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం తదితర అన్ని అంశాల్లో చట్టపరంగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ‘‘ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టు పరిధిలో ఉంది.
హైకోర్టు కంటే సీబీఐ పెద్దదా? హరీశ్ రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. రాత్రికి రాత్రే ఎవరిని అరెస్ట్ చేయాలని మేం కోరుకోవడం లేదు. అలాంటి పనులు మేం చేయం. అంతా చట్టప్రకారమే జరుగుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తున్నదని, కమిషన్ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈసారి కాళేశ్వరం నీళ్లు లేకపోయినా దేశంలోనే అత్యధికంగా కోటి 56 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణలో పండిందని తెలిపారు.
పదేండ్లు ఎస్ఎల్బీసీని కేసీఆర్ పక్కనపెట్టిండు
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనకు బీఆర్ఎస్సే కారణమని, ఆ పాపం కేసీఆర్‌దేనని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘సుమారు 3.60 లక్షల ఎకరాలకు సాగునీరందించే గొప్ప లక్ష్యంతో రూ.5 వేల కోట్లతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగంతో కూడిన సాగునీటి ప్రాజెక్టు. అయితే కమీషన్లు రావనే దురుద్దేశంతో పదేండ్ల పాలనలో కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిండు.
కనీసం పవర్ బిల్లులు కూడా కట్టలేదు. ఇందుకు బదులు కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ముందటేసుకున్నడు. దానితో లక్షకోట్లు మింగారే తప్ప చివరికి 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదు. పదేండ్లుగా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో పూడికతీత సమయంలో ఒకేసారి మట్టి కూలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనుకోకుండా సంభవించింది.
కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం అనేది మానవ తప్పిదమే. కేసీఆర్ అవినీతి, ప్రణాళికాలోపం, కమీషన్ల కక్కుర్తి, మేధావినన్న భ్రమనే కాళేశ్వరం కుంగడానికి కారణమైంది. కేసీఆర్ మాదిరిగా నేను 80 వేల బుక్స్ చదవలేదు. అందుకే కాళేశ్వరం, ఎస్‌ఎల్‌బీసీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోం. నిపుణుల కమిటీ నివేదికల తర్వాతే ముందుకు వెళ్తం.
నా మంత్రివర్గంలో నాకంటే అనుభవజ్ఞులైన, సమర్థులైన మంత్రులున్నారు. వారి వారి శాఖల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది’’ అని ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నదని.. మంత్రులు అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు తాను కూడా అప్డేట్స్ తెలుసుకుంటున్నానని సీఎం చెప్పారు.
దేశంలోనే తొలిసారి 11 సంస్థలు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌కు విద్యుత్ బిల్లులు చెల్లిండంతో పాటు, పనులు ప్రారంభించామని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడొస్తయా?
‘‘ఫిరాయింపులపై 2014 నుంచి 2024 వరకు రాజ్యాంగం ఏం మారలేదు. బీఆర్ఎస్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచి, ఏ మంత్రివర్గంలో పనిచేశారో అందరికీ గుర్తుంది. అయినా, పార్టీ ఫిరాయింపులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మొట్టమొదటిసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది నేను. గత పదేండ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరడమే కాకుండా మంత్రులుగా చేస్తే ఉప ఎన్నికలు రాలేదు.
అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?” అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీనే చేయలేని బీఆర్ఎస్.. బై ఎలక్షన్స్ అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. గోవా, మణిపూర్ లో రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన విధానం దేశ ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు పెడతామని, దీనికోసం అన్నీ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఐదేండ్ల తర్వాత దేనికైనా బాధ్యత తనదేనని, కులగణన విషయంలోనూ అన్నింటికీ తానే బాధ్యత వహిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన దారిలోనే తాను ముందుకు వెళ్తానని, పార్టీయే తనకు సుప్రీం అని ఆయన స్పష్టం చేశారు.
ఆ మిస్టరీ మరణాలపై కేటీఆర్ విచారణ ఎందుకు కోరుతలే?
కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి, ఆ కేసును వాదించిన న్యాయవాది సంజీవరెడ్డి ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘న్యాయవాది సంజీవరెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. కేటీ-ఆర్ వ్యాపార భాగస్వామిగా ఉన్న కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పదంగా చనిపోయారు.
ఏడాది కింద హైదరాబాద్‌లో జరిగిన ఒక డ్రగ్స్ కేసులో కేదార్ ఏ 4గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసులో దర్యాప్తును వేగవంతం చేయగానే దుబాయ్‌లో కేదార్ మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తున్నది. వరుసగా జరుగుతున్న ఈ మరణాల వెనక మిస్టరీ ఏమిటి? వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మేం విచారణ జరుపుతాం.
ఈ మూడు మిస్టరీ మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదు? వీట న్నింటి వెనుక ఎవరి హస్తం ఉంది?” అని ప్రశ్నించారు. మిస్టరీ మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. తద్వారా నిజాలు బయటికి వచ్చే అవకాశముందని తెలిపారు.
నా ఫోకస్ ప్రజలకు మంచి చేయడంపైనే..
తన ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయాలన్న దానిపైనేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘‘కానీ బీఆర్ఎస్ వాళ్లు ఖాళీగా ఉన్నరు. అందుకే వాళ్లు సోషల్ మీడియా, ఇతర వేదికలపై అసత్యాలను ప్రచారం చేస్తున్నరు” అని విమర్శించారు. తమ ప్రభుత్వంలో లబ్ధిపొందిన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తమ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
అందుకే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికే సమయం కేటాయిస్తానని, మిగిలిన విషయాలు పట్టించుకోనని తేల్చిచెప్పారు. గత పదేండ్లలో కేసీఆర్ చేయలేని ఎన్నో పనులను ఏడాదిలోనే తాము చేసి చూపించామన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పానని తెలిపారు. గత పదేండ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులకు ప్రతినెలా రూ.6,500 కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నామని చెప్పారు.
ప్రతినెలా రాష్ట్రానికి సుమారు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తే.. అందులో వడ్డీలు, ఉద్యోగుల జీతాలకే దాదాపుగా రూ.13 వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. మిగిలిన వాటితోనే సంక్షేమం, అభివృద్ధి అన్నీ చేయాల్సి వస్తున్నదన్నారు. అందుకే.. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే పనిలో పడ్డామని తెలిపారు. పన్నుల శాఖలో సంస్కరణలు చేశామని, దీనివల్ల జీఎస్టీ రాబడిలో సుమారు 8 శాతం వృద్ధిని నమోదు చేశామని చెప్పారు.
మైనింగ్ రంగాన్ని కూడా గాడిలో పెట్టామని.. గతంలో ఇసుకను అక్రమంగా తరలించేవారని, కానీ ఇప్పుడు అక్రమాలకు తావులేకుండా చేశామన్నారు. గతంలో నిర్దిష్ట సమయంలోనే ఇసుక బుకింగ్‌కు అవకాశం ఉండేదని.. కానీ, ఇప్పుడు 24 గంటలూ ఇసుకను బుక్ చేసుకోవచ్చనే ఆదేశాలను అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
కేసీఆర్‌కు కిషన్ రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్
మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్ అని సీఎం రేవంత్ విమర్శించారు. ‘‘కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నరు. మెట్రో విస్తరణలో సీఎంగా నాకు పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి కాంగ్రెస్ హయాంలో జరగొద్దని కిషన్ రెడ్డి భావిస్తున్నరు. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్‌లో అడ్డుకుంటున్నరు.
పదేండ్లుగా మెట్రో విస్తరణ జరగకుండా కేసీఆర్, కిషన్ రెడ్డి అడ్డుకున్నరు. తాజాగా ప్రధానమంత్రి మోదీతో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించి ఐదు అంశాలపై విజ్ఞప్తులు ఇచ్చాను. వీటిని సాధించుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ఉంది. సాధించుకుని వస్తే కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుత. బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్త” అని ఆయన పేర్కొన్నారు.