సదర్ యాదవుల ఖదర్: సీఎం రేవంత్రెడ్డి

సదర్ యాదవుల ఖదర్: సీఎం రేవంత్రెడ్డి
  • హైదరాబాద్​అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం
  • మూసీ పునరుజ్జీవంలోనూ సహకరించాలి: సీఎం రేవంత్​
  • సదర్​ సమ్మేళనానికి హాజరు

హైదరాబాద్/ముషీరాబాద్​, వెలుగు: ఏ శక్తులు అడ్డొచ్చినా హైదరాబాద్​ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కీలకమని తెలిపారు. మూసీ పునరుజ్జీవంలోనూ సహకరించాలని కోరారు. ఇక నుంచి ఏటా సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం సదర్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో  స్పెషల్ అట్రాక్షన్​గా పుంగనూరు జాతి గోవు నిలిచింది. పుంగనూరు గోవును సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నారు. 

సమ్మేళనంలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా సదర్ ఉత్సవాలు నిర్వహించే బాధ్యతలు ఎంపీ అనిల్ యాదవ్, అరవింద్ యాదవ్ కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని పిలుపునిచ్చారు. 

ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని కోరారు. ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్​ ప్రభుత్వానిదని తేల్చిచెప్పారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామన్నారు. ‘‘సదర్ అంటేనే యాదవుల ఖదర్ . సదర్ సమ్మేళనాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలి. యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించాం. యాదవ సోదరులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. 

ఆనాడు ముషీరాబాద్ లో అంజన్​కుమార్​ యాదవ్​ అన్నను గెలిపించి ఉంటే.. మీవైపు నుంచి మంత్రిగా నిలబడేవారు. అంజన్న ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యం ఉండాలని అనిల్​ను రాజ్యసభకు పంపాం” అని సీఎం పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డారని.. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడి, ధర్మం గెలిచిందన్నారు. మూసీ పునరుజ్జీవంలో యాదవ సోదరులు ధర్మం వైపు నిలబడాలని, అధర్మాన్ని ఓడిద్దామని సూచించారు.  

స్పీకర్​గా ప్రసాద్​ను ఎన్నుకోవడం మంచి నిర్ణయం: రఘువీరారెడ్డి

సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. అధికారికంగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు  తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్​గా  గడ్డం ప్రసాద్ ను ఎన్నుకుని సీఎం రేవంత్​ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, కాంగ్రెస్ చరిత్రలో అతిచిన్న వయస్సులో రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్​కు అవకాశం ఇచ్చారని అన్నారు. శ్రీకృష్ణుడు చూపిన బాటలో అందరూ నడవాలని కోరారు. 

 తెలంగాణ ఉద్యమానికి కూడా సదర్ సమ్మేళనం వేదిక అయిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఉద్యమంలో అందరిని ఒక్కటి చేసేందుకు సదర్​ సమ్మేళనం నిర్వహించారని తెలిపారు.