కేసీఆర్​ పదేండ్లలో చేయనిది.. ఏడు నెలల్లో చేసినం: సీఎం రేవంత్రెడ్డి

కేసీఆర్​ పదేండ్లలో చేయనిది.. ఏడు నెలల్లో చేసినం: సీఎం రేవంత్రెడ్డి
  • రైతులకు రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది: సీఎం రేవంత్​రెడ్డి
  • పదేండ్లలో  కేసీఆర్​ మాఫీ చేసింది రూ. 21 వేల కోట్లే 
  • ఏడు నెలల్లోనే మేం రూ. 31 వేల కోట్ల మాఫీ చేస్తున్నం 
  • కాంగ్రెస్​ మాట ఇస్తే శిలాశాసనమే
  • త్వరలో వరంగల్​లో రాహుల్​గాంధీతో కృతజ్ఞత సభ
  • మంత్రులతో ఢిల్లీ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తమని వెల్లడి
  • వీడియో కాన్ఫరెన్స్‌‌లో వివిధ జిల్లాల రైతుల‌‌తో సంభాషణ

హైద‌‌‌‌రాబాద్‌‌, వెలుగు: కేసీఆర్​ పదేండ్లలో చేయనిది తాము ఏడు నెలల్లో చేసి చూపించామని, పదేండ్లలో కేసీఆర్​ రూ. 21 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తే కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఏకంగా రూ. 31 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. తెలంగాణలోని రుణమాఫీ దేశంలోనే  తలెత్తుకునేలా ఉందని, కాంగ్రెస్​ మాట ఇస్తే శిలాశాసనమేనని రుణమాఫీతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. ‘‘ఇప్పటి వ‌‌ర‌‌కు ఆ మోడ‌‌ల్‌‌, ఈ మోడ‌‌ల్ అని ప‌‌లువురు చెప్పుకున్నరు. 

ఇక మీదట దేశంలోనే తలెత్తుకునేలా తెలంగాణ మోడల్​ను చెప్పుకుంటరు. రైతు రుణ‌‌మాఫీతో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు, యావత్​ దేశానికి ఆద‌‌ర్శంగా, న‌‌మూనాగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ‘‘ఏ వ‌‌రంగ‌‌ల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రుణ‌‌మాఫీ హామీ, రైతు డిక్లరేషన్​ ప్రకటించామో అక్కడే కృత‌‌జ్ఞత స‌‌భ పెడ‌‌తాం. ఆ స‌‌భ‌‌కు రాహుల్ గాంధీని ఆహ్వానించి రాష్ట్ర రైతుల త‌‌ర‌‌ఫున ఆయ‌‌న‌‌కు కృత‌‌జ్ఞత‌‌లు చెప్తం” అని సీఎం రేవంత్​ వెల్లడించారు. రైతులకు రుణమాఫీతో తన జీవితం ధన్యమైందని అన్నారు.  

రూ.2 లక్షల రుణ‌‌మాఫీ కార్యక్రమాన్ని సెక్రటేరియెట్​లో గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. పంద్రాగస్టులోగా మొత్తం మూడు విడతల్లో రుణాలు మాఫీ చేయనున్నారు. తొలి విడతలో భాగంగా గురువారం రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేశారు. ఈ సంద‌‌ర్భంగా రాష్ట్రంలోని 577 రైతు వేదికల్లోని రైతులను, రాష్ట్ర ప్రజ‌‌ల‌‌ను ఉద్దేశించి సీఎం రేవంత్​ మాట్లాడారు. ‘‘జెడ్పీటీసీ స‌‌భ్యుడిగా, శాస‌‌నమండ‌‌లి స‌‌భ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశాను.  ఈ పదహారేండ్ల నా రాజ‌‌కీయ జీవితంలో ఈ రోజు మ‌‌రుపురాని రోజు” అని ఆయన భావోద్వేగానికి గుర‌‌య్యారు. 

కేసీఆర్​ చెప్పిందొకటి.. చేసిందొకటి

రూ.ల‌‌క్ష వరకు ఉన్న రైతు రుణాలు రూ.16 వేల కోట్లు మాఫీ చేస్తామన్న హామీతో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వ‌‌చ్చిన కేసీఆర్  ఐదేండ్లలో ద‌‌ఫాద‌‌ఫాలుగా కేవ‌‌లం రూ.12 వేల కోట్లు మాఫీ చేశారని..  రెండోసారి రూ.21  వేల కోట్ల రుణ‌‌మాఫీ చేస్తామ‌‌ని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ ద‌‌ఫాద‌‌ఫాలుగా రూ.9 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మొత్తంమీద ప‌‌దేండ్లలో కేసీఆర్​ మాఫీ చేసింది  రూ.21 వేల కోట్లకు మించి లేదని దుయ్యబట్టారు.

 ‘‘గ‌‌త ప్రభుత్వం ఒకే సారి రుణ‌‌మాఫీ చేయ‌‌క‌‌పోవ‌‌డంతో రైతులకు వ‌‌డ్డీలు పెరిగి, అప్పులు తీరలేదు. కానీ 2022, మే 6 న వ‌‌రంగ‌‌ల్​లో  రాహుల్ గాంధీ రైతు డ్లిక‌‌రేష‌‌న్ ప్రక‌‌టించారు. నాడే రూ.2 ల‌‌క్షల దాకా రుణ‌‌మాఫీ చేస్తామని హామీ ఇచ్చినం. 2023 సెప్టెంబ‌‌ర్​ 17న కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఆరు గ్యారంటీల‌‌తో పాటు రైతు రుణ‌‌మాఫీపై మరోసారి మాట ఇచ్చారు” అని ఆయన తెలిపారు. ‘‘మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా, తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ పేరును శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. రైతుల అనుమ‌‌తితో నేను, డిప్యూటీ సీఎం భ‌‌ట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కృత‌‌జ్ఞతలు తెలుపుతాం” అని సీఎం వెల్లడించారు. 

తొలి విడతలో 6,098 కోట్లు

తాము ఏకకాలంలో రూ.2 ల‌‌క్షల మేర రుణాల‌‌ను మాఫీ చేస్తున్నామని.. తొలి విడ‌‌త‌‌గా  రూ.1 ల‌‌క్ష వ‌‌రకు ఉన్న రుణాల‌‌కు రూ.6,098 కోట్లను విడుద‌‌ల చేశామ‌‌ని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. రెండో విడ‌‌త‌‌గా రూ.1.50 ల‌‌క్షల వ‌‌ర‌‌కు రుణాలు ఉన్న రైతుల‌‌కు, మూడో విడ‌‌త‌‌గా రూ.2 లక్షల వ‌‌ర‌‌కు రుణాలున్న రైతులకు మాఫీ చేస్తామ‌‌ని స్పష్టం చేశారు.  మొత్తంగా రూ.31 వేల కోట్లను రైతు రుణ ఖాతాల్లో వేసి రుణ విముక్తుల‌‌ను చేస్తామ‌‌ని తెలిపారు.

 తమ ప్రభుత్వం డిసెంబ‌‌ర్​ ఏడో తేదీనే ప్రమాణ స్వీకారంచేసినా.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ‌‌ను ప్రారంభించిన డిసెంబ‌‌ర్​ 9వ తేదీని ప‌‌రిగ‌‌ణ‌‌న‌‌లోకి తీసుకొని రుణ‌‌మాఫీ చేస్తున్నామ‌‌ని చెప్పారు.  డిసెంబ‌‌ర్​ 9న మ‌‌రో పండుగ ఉంద‌‌ని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబ‌‌ర్​ 9వ తేదీనేన‌‌ని ఆయన గుర్తుచేశారు. అందుకే 2018 డిసెంబ‌‌ర్​ 12 నుంచి 2023 డిసెంబ‌‌ర్​ 9 వ‌‌ర‌‌కు తీసుకున్న రుణాల‌‌ను మాఫీ చేస్తున్నామ‌‌ని చెప్పారు. 

దొంగల మాటలు నమ్మొద్దు

రుణ‌‌మాఫీకి రేష‌‌న్ కార్డు ఉండాల‌‌నే అపోహ‌‌ను కొంద‌‌రు సృష్టిస్తున్నార‌‌ని సీఎం రేవంత్ రెడ్డి మండిప‌‌డ్డారు. రేష‌‌న్ కార్డు అనేది కేవ‌‌లం కుటుంబాన్ని గుర్తించ‌‌డానికేనని చెప్పారు. రుణ‌‌మాఫీకి రేష‌‌న్ కార్డు ప్రాతిప‌‌దిక కాద‌‌ని, రుణమాఫీకి పాస్ బుక్​ కొలబద్ద అని సీఎం స్పష్టం చేశారు. ‘‘భూమి ఉండి, ఆ భూమికి పాసు బుక్ ఉండి, పాసు బుక్‌‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తం” అని అన్నారు. ఈ విష‌‌యంలో కొంద‌‌రు దొంగ‌‌లు చెప్పే దొంగ మాట‌‌ల‌‌ను న‌‌మ్మొద్దని కోరారు. రుణ‌‌మాఫీకి సంబంధించి సాంకేతిక స‌‌మ‌‌స్యలు త‌‌లెత్తితే బ్యాంకు అధికారుల‌‌ను సంప్రదించాల‌‌ని రైతులకు సూచించారు. రైతు ఖాతాల్లోకి రుణ‌‌మాఫీ సొమ్ము చేరేలా వ్యవసాయ శాఖ అధికారులు చూడాల‌‌ని అన్నారు.    

నీ రాజీనామా అడుగ.. ఎట్లాగో పారిపోతవ్​

కాంగ్రెస్​ పార్టీ ఏదైతే చెప్తుందో అది నూటికి నూరు శాతం అమలు చేస్తుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ‘‘రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం” అని అన్నారు. రైతు రుణమాఫీ అమలైతే రాజీనామా చేస్తానన్న వాళ్లకు తాను ఇప్పుడు రాజీనామా చేయాలని అడగదలచుకోలేదని, ఎట్లాగో వాళ్లు పారిపోతారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ‘‘ఆ నాడు సవాళ్లు విసిరినవాళ్లకు నా విజ్ఞప్తి ఒక్కటే. మిమ్మల్ని రాజీనామా చేయాలని మేం అడగం.. ఎందుకంటే మీరు ఎట్లాగో పారిపోతరు. మాకు తెలుసు. కాంగ్రెస్​ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది. మీ లెక్క కాదు” అని ఆయన అన్నారు. 

రుణ‌‌మాఫీ చెక్కుల అంద‌‌జేత‌‌

రూ.ల‌‌క్ష రుణ‌‌మాఫీ సందర్భంగా సెక్రటేరియెట్​లో ప‌‌ది మంది రైతుల‌‌కు సీఎం రేవంత్ రెడ్డి చెక్కుల‌‌ను అంద‌‌జేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భ‌‌ట్టి విక్రమార్క, శాస‌‌న మండ‌‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌‌ర్ రెడ్డి,  అసెంబ్లీ స్పీక‌‌ర్ గ‌‌డ్డం ప్రసాద్ కుమార్‌‌, మంత్రులు తుమ్మల నాగేశ్వర‌‌రావు, ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌‌నివాస్‌‌రెడ్డి, పొన్నం ప్రభాక‌‌ర్‌‌, శ్రీ‌‌ధ‌‌ర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ స‌‌ల‌‌హాదారు కే.కేశ‌‌వ‌‌రావు, ముఖ్యమంత్రి స‌‌ల‌‌హాదారు వేం న‌‌రేంద‌‌ర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద‌‌ర్శి శాంతికుమారి త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.

సోనియా, ఖర్గే, రాహుల్​కు కృతజ్ఞతా తీర్మానం

‘‘రైతు రుణ‌‌మాఫీ హామీ ఇచ్చి నిలుపుకున్నందున సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ధ‌‌న్యవాదాలు తెలుపుదామా’’ అని రైతు వేదిక‌‌ల్లో ఉన్న రైతుల‌‌ను సీఎం రేవంత్​ రెడ్డి అడిగారు. అందుకు స‌‌మ్మతిస్తూ అంతా చ‌‌ప్పట్లతో ఆమోదం తెలుపడంతో.. సోనియా, ఖర్గే, రాహుల్​కు కృత‌‌జ్ఞత తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలోనే మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని వ‌‌రంగ‌‌ల్ కృత‌‌జ్ఞత స‌‌భ‌‌కు ఆహ్వానిస్తామ‌‌ని సీఎం వెల్లడించారు. 

అప్పులకే నెలకు రూ. 7వేల కోట్ల మిత్తి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన‌‌ప్పుడు ఏడాదికి రూ.6, 500 కోట్ల వ‌‌డ్డీలు క‌‌ట్టాల్సి ఉంటే.. గ‌‌త బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన రూ. ఏడు ల‌‌క్షల కోట్ల అప్పుల‌‌తో ఇప్పుడు నెల‌‌కు ఏకంగా రూ.7 వేల కోట్లు మిత్తీలు చెల్లించాల్సి వ‌‌స్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. గ‌‌త ప్రభుత్వం జీతాలు కూడా స‌‌రిగ్గా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఏడునెలల్లోనే తాము రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేప‌‌ట్టామ‌‌ని ఆయన తెలిపారు.