హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం (నవంబర్ 29) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తుండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం రేవంత్.. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని.. ముఖ్యంగా ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్దిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.