ప్రచారానికి మిగిలింది 2 రోజులే.. క్యాంపెయిన్‌‌ను ముమ్మరం చేసిన క్యాండిడేట్లు, లీడర్లు

ప్రచారానికి మిగిలింది 2 రోజులే.. క్యాంపెయిన్‌‌ను ముమ్మరం చేసిన క్యాండిడేట్లు, లీడర్లు
  • నేడు కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాలలో సీఎం రేవంత్‌‌రెడ్డి సభలు
  • నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు, ఇన్‌‌చార్జులు
  • లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, గ్రాడ్యుయేట్లతో ఆత్మీయ సమ్మేళనాలు
  • ఇతర జిల్లాల లీడర్లందరినీ ప్రచారంలో వాడుకుంటున్న బీజేపీ

కరీంనగర్, వెలుగు : గ్రాడ్యుయేట్, టీచర్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సోమ, మంగళవారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో క్యాండిడేట్లు, పార్టీల లీడర్లు తమ క్యాంపెయిన్‌‌ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అడ్వకేట్లు, డాక్టర్లు, టీచర్లు, లెక్చరర్లు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు తదితర వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌‌ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌ నరేందర్‌‌రెడ్డి తరఫున పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌కుమార్‌‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌‌ చైర్మన్లు ప్రచారం చేస్తుండగా... సీఎం రేవంత్‌‌రెడ్డి కూడా సోమవారం రంగంలోకి దిగబోతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాలలో సోమవారం గ్రాడ్యుయేట్లతో భారీ సభల నిర్వహణకు ప్లాన్‌‌ చేశారు. సీఎం రేవంత్‌‌ రెడ్డి రాక కాంగ్రెస్ క్యాండిడేట్‌‌కు బూస్టింగ్‌‌ ఇస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

నియోజకవర్గాల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌‌ జిల్లాల పరిధిలోని 42 నియోజకవర్గాలకు ఇన్‌‌చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌‌ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్‌‌చార్జులు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించారు. 

పార్లమెంట్‌‌ నియోజకవర్గాలకు ఇన్‌‌చార్జులుగా ఉన్న మంత్రులు శ్రీధర్‌‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో పాటు ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేశ్‌‌ షెట్కార్, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌‌ వెంకటస్వామి, గడ్డం వినోద్‌‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. 50 మంది గ్రాడ్యుయేట్లకో ఇన్‌‌చార్జిని నియమించి కోఆర్డినేట్‌‌ చేస్తున్నారు.

ఇతర జిల్లాల బీజేపీ లీడర్లంతా నాలుగు జిల్లాల్లోనే.. 

బీజేపీ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు మద్దతుగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌కుమార్‌‌, ఎంపీలు రఘునందన్‌‌రావు, అరవింద్, గొడం నగేశ్‌‌తో పాటు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఇతర జిల్లాల్లోని పార్టీ శ్రేణులను కూడా ఈ నాలుగు జిల్లాల్లోనే మోహరించింది.

 25 మందికో ప్రభారిని నియమించి.. మైక్రో లెవల్‌‌లో పోల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ చేస్తున్నారు. 45 శాతం ఓట్లు ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలోనే ఉండడంతో కేంద్రమంత్రి బండి సంజయ్ ఇక్కడే ఎక్కువగా ఫోకస్‌‌ చేస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌‌ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌‌రావు, రఘునాథ్‌‌రావును సైతం ఆ పార్టీ అగ్రనేతలు ఒప్పించి ప్రచారంలోకి  తీసుకొచ్చారు. 

నేడు మూడు జిల్లాల్లో సభలు

కాంగ్రెస్‌‌ గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌ నరేందర్‌‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌‌రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌‌ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలకు హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్లు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేశారు. సీఎం సోమవారం ఉదయం హైదరాబాద్‌‌ నుంచి హెలికాప్టర్‌‌లో బయలుదేరి ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్‌‌ చేరుకుంటారు. అక్కడ సభలో మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలలో ప్రచార సభకు హాజరవుతారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌‌ ఎస్‌‌ఆర్‌‌ఆర్‌‌ కాలేజీ గ్రౌండ్స్‌‌లో నిర్వహించే సభలో మాట్లాడుతారు. ఈ సభలకు గ్రాడ్యుయేట్లను భారీగా తరలించేందుకు కాంగ్రెస్‌‌ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.