పార్టీ లైన్ దాటొద్దు .. సమస్యలుంటే నాతో చెప్పండి : సీఎం రేవంత్​రెడ్డి

పార్టీ లైన్ దాటొద్దు .. సమస్యలుంటే నాతో చెప్పండి : సీఎం రేవంత్​రెడ్డి
  • నాకు చెప్పలేనివి హైకమాండ్​తో చెప్పండి 
  • సీఎల్పీ మీటింగ్​లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​ రెడ్డి
  • సపరేట్ మీటింగ్​లు పెడ్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు 
  • స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి
  • పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేద్దాం
  • 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే
  • కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నరు
  • ఎలాంటి పైరవీలు తన దగ్గర నడువయని సీఎం స్పష్టీకరణ
  • ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దు: దీపాదాస్ మున్షి
  • రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: పార్టీ లైన్​ ఎవరు దాటినా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలి గానీ సపరేట్​ మీటింగులతో పార్టీకి నష్టం కలిగించొద్దన్నారు. జూబ్లీహిల్స్​లోని ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్డీ సెంటర్​లో గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ,  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు  ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5 గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది.

 పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చించారు. మీటింగ్​  ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి..  పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మీకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా మంత్రి, ఇన్​చార్జ్​ మంత్రి, పీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​లో ఎవరికైనా చెప్పుకోవచ్చు.. అవసరమైతే నాకు చెప్పండి.. నాకు చెప్పలేనివి ఏమైనా ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లండి.. నేనే స్వయంగా రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పిస్త. అంతేగానీ సపరేట్ మీటింగ్ లు పెట్టుకుంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. దీని వల్ల మీతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నట్లు తెలిసింది. 

పార్టీలో మనమంతా కుటుంబసభ్యులం..  మన మధ్య నమ్మకం, నిజాయితీ ముఖ్యం.. మన లీడర్ మైండ్ సెట్ ప్రకారం మనమందరం నడుచుకోవాలి” అని ఆయన సూచించినట్లు సమాచారం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు రెండోసారి గెలవడం అంత ఈజీ కాదని,  ప్రజల కోసం కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. కాగా, కొంతమంది తన దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారని, తన దగ్గర పైరవీలు నడువయని సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం. పైరవీలు చేస్తే జనాల్లో పలుచబడ్తామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.  

ఎస్సీ వర్గీకరణ, కులగణనను జనంలోకి తీసుకెళ్లండి

బీసీ రిజర్వేషన్లపై రాబోయే పది రోజుల్లో బీసీ డెడికేటెడ్​ కమిషన్  ప్రక్రియ పూర్తవుతుందని, లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్​ సూచించారు.‘‘పంచాయతీ ఎన్నికల్లో  90 శాతం సర్పంచులను ఏకగ్రీవం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రామాలకు వెళ్లినప్పుడు స్థానిక సమస్యలపై ఏ హామీలనైతే ఇచ్చారో వాటిని పరిష్కరించాలి. ఇందుకోసం సంబంధిత మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించుకోవాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బడులు, గుడులు, ఇతర నిర్మాణాలను పూర్తిచేయాలి” అని సీఎం తెలిపారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలదేనని చెప్పారు. 

ప్రభుత్వం తీసుకున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి  కీలక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయం వల్ల బీసీలకు, ఎస్సీలకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి. ఏడాది కాంగ్రెస్​ పాలనలో హామీలు అమలు చేసిన తీరును, బీఆర్‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అన్యాయాలను జనానికి వివరించాలి” అని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. 

ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలకే: భట్టి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలకే పోతున్నది. మిగిలిన నిధులు ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయి’’ అని ఆయన వివరించారు. సమావేశంలో ఓ ఎమ్మెల్యే పెండింగ్ బిల్లుల విషయం ప్రస్తావనకు తేగా..  ఆ వివరాలను కూడా భట్టి వెల్లడించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులతో వస్తున్నారని, వాటిని ఆర్థిక శాఖ నుంచి సాధ్యమైనంత త్వరగా విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

 మంత్రుల్లో అత్యధికంగా బిల్లులు విడుదల చేయించుకున్న వారిలో మొదటి స్థానంలో జూపల్లి కృష్ణారావు ఉండగా, చివరి స్థానాల్లో ఉత్తమ్, పొంగులేటి ఉన్నారని భట్టి వివరించారు. కాగా,  సీఎల్పీ సమావేశానికి  56 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డి, వాకాటి శ్రీహరి  వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు. సీఎల్పీ మీటింగ్ కావడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరుకాలేదు. ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ మీటింగ్ కు దూరంగా ఉన్నారు.

సీక్రెట్ ​మీటింగులు పెడ్తే యాక్షన్: దీపాదాస్ మున్షీ

ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య గ్యాప్ ఉందని, అలాగే కేడర్‌‌‌‌ తో ఎమ్మెల్యేలకు గ్యాప్ ఏర్పడిందని, ఇది పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షి హెచ్చరించారు. సీఎల్పీ సమావేశంలో ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున ఇలాంటి తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెడితే జనంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదైనా సమస్య ఉంటే పార్టీ వేదికలపై నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే యాక్షన్​తప్పదని ఆమె హెచ్చరించారు.

కొందరు మంత్రులు బీఆర్​ఎస్​ ఉచ్చులో పడ్తున్నరు: రాజగోపాల్ ​రెడ్డి

బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడితే కొందరు మంత్రులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి వాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారని సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లు తెలిసింది. రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, దీంతో జనంలోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయని ఆయన అన్నట్లు సమాచారం. 

మాలలకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలి: వివేక్ వెంకటస్వామి

ఎస్సీ వర్గీకరణ విషయంలో దళితుల్లోని ఏ కులం వారు ఎంత మంది ఉన్నారనే దానిపై మరిన్ని వివరాలు ఇస్తే బాగుంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం జరగనివ్వొద్దన్నారు. తెలంగాణలో మొదటి నుంచి మాలలు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాలలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని సీఎల్పీ భేటీలో ఆయన అన్నట్లు తెలిసింది.  రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మాలలకు పూర్తి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. 

బీఆర్​ఎస్​పై డాక్యుమెంట్లతో అనిరుధ్ రెడ్డి

సీఎల్పీ మీటింగ్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పెద్దసంఖ్యలో డాక్యుమెంట్లు తీసుకొని రావడం చర్చనీయాంశమైంది. గత సర్కార్​లో బీఆర్​ఎస్​ నేతలు  పెద్దమొత్తంలో సీలింగ్ భూములను పట్టాలు చేసుకున్నారని ఆయన అన్నారు. భూదందాలో కేటీఆర్ బినామీలే  కీలకంగా ఉన్నారని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈమేరకు తన వెంట తెచ్చిన పలు డాక్యుమెంట్లను సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి,  ఆ భూములను గిరిజనులకు దక్కేలా చూడాలని, తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.