ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖపై, మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు సదస్సు వంటి అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. రైతుల్లో అవగాహన పెంచడానికి వీలుగా సదస్సును ఒకరోజు కాకుండా నవంబర్ 28 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేలా స్టాళ్లను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని రేవంత్ చెప్పారు.
విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణల స్టాళ్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు రేవంత్. ఆధునిక పరికరాల వినియోగం, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్ల వాడకం వంటి సాంకేతిక పరికరాలన్నింటినీ సదస్సు నిర్వహించే చోట ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు ఉపయోగపడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.