ప్రజావాణి డ్యాష్​ బోర్డు లైవ్ యాక్సెస్ సీఎంకు: రివ్యూలో అధికారులకు ఆదేశం

ప్రజావాణి డ్యాష్​ బోర్డు లైవ్ యాక్సెస్ సీఎంకు: రివ్యూలో అధికారులకు ఆదేశం
  • ప్రజల అర్జీల పరిష్కారం తీరు, విజ్ఞప్తులను స్వయంగా చూస్త: రేవంత్​రెడ్డి
  • స్కీమ్ల సమాచారం, లబ్ధిదారుల వివరాలతో పోర్టల్​ ఉండాలి
  • జిల్లా కేంద్రాల్లోని ప్రజావాణి డ్యాష్​బోర్డును ప్రజాభవన్కు అనుసంధానం చేయాలి

హైదరాబాద్​, వెలుగు: ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత  పారదర్శకమైన, సమర్థవంతమైన విధానాలు అమలుచేయాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని, ముఖ్యమంత్రికి లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దీంతో తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందని.. అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయటం వేగవంతమవుతుందని ఆయన తెలిపారు. అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్ లైన్ లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

ప్రజాభవన్లో వారంలో రెండు రోజులు కొనసాగుతున్న ప్రజావాణిలో ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు.. వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి.. అర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలు వంటి అంశాలపై సోమవారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్​లో జరిగే ప్రజావాణి డ్యాష్ బోర్డుతో అనుసంధానం చేయాలన్నారు. దీంతో మండలస్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలు వెంటవెంటనే అక్కడికక్కడే పరిష్కారమవుతాయని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నదని సీఎం తెలిపారు.

68.4 శాతం పరిష్కారం: అధికారులు
వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్ లు ఏర్పాటు చేశామని, గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అర్జీదారులకు ఇబ్బందిలేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 

ప్రజాభవన్​లో 2023 డిసెంబర్ నుంచి  ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా.. అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారని,  వీటిలో 68.4 శాతం (37,384) అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు వివరించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్​ శాంతికుమారి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.