కేడర్​లో ఫుల్​ జోష్.. సీఎం రేవంత్​ రెడ్డి సభకు భారీగా తరలి వచ్చిన మహిళలు

కేడర్​లో ఫుల్​ జోష్.. సీఎం రేవంత్​ రెడ్డి సభకు భారీగా తరలి వచ్చిన మహిళలు
  • నారాయణపేట చేనేత వస్ర్తాలతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సత్కరించిన ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
  • సీఎం రేవంత్​ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు హాజరైన పాలమూరు ఎంపీ డీకే అరుణ

మహబూబ్​నగర్​/నారాయణపేట, వెలుగు :నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన 'ప్రజా పాలన-ప్రగతి బాట' సభ గ్రాండ్​ సక్సెస్​ అయ్యింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలి రాగా..   సభలో మహిళలే ఎక్కువగా కనిపించడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.  సభ గ్రాండ్​ సక్సెస్​ కావడంతో కేడర్​లో పుల్​ జోష్​ నిండుకుంది. 

అంతకు ముందు సీఎం వికారాబాద్​ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మధ్యాహ్నం నారాయణపేటకు బయల్దేరారు. ముందుగా ఆయన స్థానిక మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్​ బంక్​ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.  మంత్రి సీతక్క స్కూటీలో పెట్రోల్​ పోసి బంక్​ను  ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో సీఎం చిట్​చాట్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వం మహిళా సంఘాల కోసం అమలు చేస్తున్న స్కీముల గురించి మాట్లాడుతూ.. స్కీముల వల్ల తాము లాభం పొందుతున్నట్లు సీఎంకు వివరించారు. అక్కడి నుంచి అప్పక్​పల్లికి వెళ్లిన సీఎం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం పారతో మట్టిని తీయగా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి   మట్టిని తట్టలోకి ఎత్తాడు. అనంతరం ఎంపీ డీకే అరుణతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరి కాయలు కొట్టారు. 

ఈ సందర్భంగా ఇండ్ల లబ్ధిదారులతో కలిసి సీఎం గ్రూప్​ ఫొటో దిగారు. అక్కడి నుంచి గవర్నమెంట్​ మెడికల్​ కాలేజ్​ వద్దకు చేరుకున్న సీఎం   నర్సింగ్​ కాలేజ్​, మెడికల్​ కాలెజ్​ మొదటి సంవత్సర అకడమిక్​ బ్లాక్​  తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీకి చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం స్టూడెంట్లతో కలిసి ఆయన గ్రూప్​ ఫొటో దిగారు.

చేనేత వస్ర్తాలతో సత్కారం

రేవంత్​ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి నారాయణపేటకు వచ్చారు. దీంతో ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి సీఎంకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నారాయణపేట చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలతో ఆయన్ను సత్కరించారు. స్టేజిపై ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ర్ట స్థాయి ఆఫీసర్లను ముదురు ఎరువు, ఆకుపచ్చ, ఆష్​ కలర్​తో ఉన్న చేనేత వస్ర్తాలతో సన్మానించారు.

సీఎంకు డీకే అరుణ వినతి

సీఎం పాల్గొన్న ప్రతి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ప్రొటోకాల్​ ప్రకారం పాలమూరు ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని డీకే అరుణ సీఎంకు అందజేశారు. మెడికల్​ కాలేజ్​ వద్ద ఎంపీ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైందని, వైద్య విద్య  ను నేర్చుకుని పేదలకు సేవ చేయాలని కోరారు.  అందరికీ వైద్యం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అధునాతన హంగులతో నిర్మించిన మెడికల్ కాలేజినీ స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇక్కడ వైద్య విద్య నేర్చుకొని విదేశాలకు, హైదరాబాద్ వెళ్లడం కరెక్ట్ కాదని, ఇలాంటి రూరల్ ఏరియాలోని  ప్రజలకు వైద్య సేవలు అందించాలని అప్పుడే ఈ కాలేజి ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని డీకే అరుణ అన్నారు.

42 శాతం రిజర్వేషన్​లు ఇచ్చేందుకు కంకణబద్ధులైనరు

కులగణన చేసి దానికి  చట్టం చేసి రానున్న ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ కల్పించేందుకు సీఎం కంకణబద్దులై ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్పీ వర్గీకరణ  చేసి ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాలకు న్యాయం చేసే విధంగా రిజర్వేషన్లు తెస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళా సంఘాలకు తొలిసారిగా పెట్రోల్​ బంకును ఏర్పాటు చేసి వారికే నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో అద్భుతమైన ఆలోచన అని ఆయన అన్నారు.

ఎంత చేసినా తక్కువే..

నారాయణపేట, మక్తల్​, కొడంగల్​ వెకనబడిన ప్రాంతాలని వీటికి ఏం చేసినా తక్కువేనని, అందుకే ఈ ప్రాంతానికి సాగునీరు అందించటానికి సీఎం కొండగల్​ లిఫ్ట్​ను రూ.4,500 కోట్లతో నిర్మిస్తున్నారని ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్ధిపై బీఆర్ఎస్​తో చర్చకు సిద్ధమని అన్నారు. 

ప్రతి ఒక్కరికీ పథకాలు..

కాంగ్రెస్​ పాలనలో ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తానని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో ఆ పార్టీ లీడర్ల మనుషులకే పథకాలు వర్తింపచేసేవారని విమర్శించారు. తాను ప్రజల బిడ్డనని ఎవరు తమకు  ఆర్జి పెట్టుకున్నారో అందరికి పథకాలు అందిస్తామన్నారు. జిల్లాలో రూ.1000 కోట్ల అభివృద్ది  పనులకు శంకుస్థాపనలు చేయటం సంతోషకరమన్నారు. ఇది పేట అభివృద్ధికి  తొలిమెట్టని అన్నారు. జిల్లాలో పేట కొడంగల్​ ఎత్తిపోతలతో సాగునీటి ప్రాజెక్టు జరుగుతున్నా కొయిలకొండ, కొండాపూర్​ ప్రాంతాల్లో కూడా  నీరందించేటట్లు ప్రాజెక్టు డిజైన్​ మార్చాలని  కోరారు.

అంతేకాకేండా మిషన్​ భగీరథతో సమస్యలు వస్తున్నాయని, నీటి సమస్య ఉందిని అందుకోసం మక్తల్​, నారాయణపేట, కొడంగల్​లో నీటి సమస్య తీర్చేందుకు కొడంగల్​ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటిని అందించటానికి కొత్త డీపీఆర్​ ​ తయారు చేశామని దాని సీఎం పరిశీలించి సమస్యను తీర్చాలని  కోరారు. 

కార్యక్రమంలో సీఎస్​ శాంతికుమారి, డీజీపీ జితేందర్​, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసుదన్​రెడ్డి, వీర్లపల్లి శంకర్​, కూచకుళ్ల రాజేశ్ ​రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ,  రాంమ్మెహన్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, నారాయణపేట కలెక్టర్​ ​ సిక్తా పట్నాయక్​, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ యోగేశ్​ గౌతమ్​, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్​ కుమార్​ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి కుంభం శివకుమార్​రెడ్డి, గ్రంథాలయ చైర్మన్​ ​ వార్ల విజయ్​కుమార్​, మార్కెట్​ చైర్మెన్​ సదాశివరెడ్డి,  ఫిషరిస్​ చైర్మెన్​ కాంతుకుమార్ పాల్గొన్నారు.