- ఢిల్లీలో రేవంత్ కోసం ఇల్లు రెడీ
- సీఎం అధికారిక నివాసంలో మరమ్మతులు
- కేసీఆర్ నేమ్ ప్లేట్ తొలగింపు
- ఇదే ఇంట్లో దాదాపు 20 ఏండ్లున్న కేసీఆర్
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కోసం తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక నివాసాన్ని అధికారులు సిద్ధం చేశారు. కేసీఆర్ పేరుతో ఉన్న పాత నేమ్ ప్లేట్ ను తొలగించి, దాని స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరుతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో కొత్త నేమ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి హోదాలో 2004లో ఈ నివాసానికి కేసీఆర్ మారారు. అనంతరం ఉద్యమ నేతగా, తెలంగాణ సీఎంగా దాదాపు 20 ఏండ్ల పాటు ఇదే ఇంట్లో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కేసీఆర్ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన వస్తువులను ఇటీవల తరలించడంతో కొత్త సీఎం కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు మరమ్మతులు చేశారు. సీఎం బంధువులు తుగ్లక్ రోడ్ లో పూజలు నిర్వహించినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీకి వస్తున్న రేవంత్.. తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసంలో ఉంటారా? లేదా? అనే దానిపై క్లారిటీ రానుంది.
ఢిల్లీలో సెక్యూరిటీ తగ్గింపు..
బీఆర్ఎస్ హయాంలో తుగ్లక్ రోడ్ లోని సీఎం నివాసం వద్ద ఒక్కో నెల చొప్పున నాలుగు పోస్ట్ లకు చెందిన తెలంగాణ బెటాలియన్ (దాదాపు 50 మంది) సిబ్బంది కాపలా ఉండేవారు. సర్దార్ పటేల్ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కేంద్ర కార్యాలయం ప్రారంభమైన తర్వాత మరిన్ని స్పెషల్ టీమ్ లను గత ప్రభుత్వం ఢిల్లీలో మోహరించింది. ఇక వసంత్ విహార్ లోని కొత్త భవనానికి భద్రతను పెట్టింది.
దీనికి తోడు సీఎం సెక్యూరిటీ ఫోర్స్ అదనంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ భద్రతను రేవంత్ తగ్గించారు. తుగ్లక్ రోడ్ కోసం వచ్చే తెలంగాణ బెటాలియన్ ను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఏపీ, తెలంగాణ భవన్ కోసం వచ్చిన టీమ్ లోని ముగ్గురు జవాన్లు తుగ్లక్ రోడ్ లో కాపలా కాస్తుండగా... సీఎం సెక్యూరిటీలో నలుగురిని మాత్రమే ఢిల్లీలో పెట్టారు.