సీఎం రేవంత్ చిట్చాట్.. తన బిజినెస్ పార్ట్నర్ కేధార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ స్పందన ఏది?

సీఎం రేవంత్ చిట్చాట్.. తన బిజినెస్ పార్ట్నర్ కేధార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ స్పందన ఏది?

న్యూఢిల్లీ: టాలీవుడ్ నిర్మాత కేధార్ అనుమానాస్పద మృతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన బిజినెస్ పార్ట్నర్ కేధార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ స్పందన ఏదని సీఎం ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేధార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేధార్ కీలక నిందితుడని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారని.. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేధార్ దుబాయ్ లో చనిపోయారని సీఎం రేవంత్ చెప్పారు.

ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. అనుమానాస్పద మరణాలపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరడం లేదని సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై ప్రస్తుతం ఏమీ మాట్లాడనని, ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు రాకుండా ఏమీ మాట్లాడనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని, మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్కు నిధులు ఇవ్వాలని, రీజిన‌ల్ రింగ్ రైల్‌.. డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండని, సెమీ కండ‌క్టర్ మిష‌న్‌కు అనుమ‌తించాలని, ప్రధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.