ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం.. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్

ఎక్స్ పీరియం పార్క్ అద్భుతం.. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డులో ఉన్న శంకర్ పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 150 ఎకరాల్లో 85 దేశాలకు చెందిన 25 వేల మొక్కలతో ఎక్స్ పీరియం పార్క్ను రాందేవ్ రావు  ఏర్పాటు చేశారు. ఎక్స్ పీరియం పార్క్ను సినీ  నటుడు చిరంజీవితో కలిసి సీఎం రేవంత్ సందర్శించారు. కోట్ల రూపాయలు విలువ చేసే మొక్కలతో ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియం పార్క్ చైర్మన్ రాందేవ్ రావును సీఎం అభినందించారు. మొత్తం 150 కోట్ల రూపాయలు విలువ చేసే మొక్కలతో ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఏర్పాటైంది. పార్క్లో లక్ష విలువ చేసే చెట్ల నుంచి మూడు కోట్ల విలువ చేసే చెట్లు ఏర్పాటు చేశారు. పార్క్లో రూ.5 లక్షల నుంచి కోటి విలువైన శిల్పాలు నిర్మాణం కూడా ఆకట్టుకున్నాయి. పార్క్లో మొత్తం శిల్పాల విలువ రూ.15 కోట్లకు పైమాటే.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు మంత్రులతో చర్చించి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించామని సీఎం తెలిపారు. తెలంగాణకు రావాల్సిన టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం రాలేదని, టెంపుల్ టూరిజంతో రాష్ట్ర ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని సీఎం చెప్పారు. టెంపుల్ టూరిజం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని, శుభకార్యాలు చేయాలంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు టెంపుల్ టూరిజం మీద దృష్టి పెట్టలేదని, రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రాంతాలు వెలుగులోకి రాలేదని,  వాటికి దక్కాల్సినంత ప్రాధాన్యత రాలేదని సీఎం వ్యాఖ్యానించారు.

ALSO READ | వరల్డ్ ఫేమస్ చెట్లతో ఎకో పార్క్ ఆకట్టుకుంటోంది : సినీ నటుడు చిరంజీవి

మన రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం వెనుక పడ్డాయని, రాబోయే రోజుల్లో ఎకో టూరిజం పాలసీ తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక్కడ ఉండే సహజ వనరులతో చాలా రోగాలు నయం అవుతాయని, టీబీ లాంటి సమస్య వస్తే ఇక్కడ రెండు మూడు నెలలు వదిలేస్తే రోగం నయమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని, రాందేవ్ రావును మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ అభినందించారు. ఎకో టూరిజం పాలసీలో భాగంగా ఇలాంటి పార్క్లను ఇంకా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రామయ్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి కేంద్రం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారని సీఎం కొనియాడారు. పని చేసే వారికి ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తుందని చెప్పారు. ప్రతి విద్యార్థి స్కూల్లో తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలనే కార్యక్రమాన్ని తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.