హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి హాజరయ్యారు.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్పనులు 2021లో ప్రారంభమైనప్పటికీ పలు కారణాల వల్ల ప్రారంభానికి జాప్యం జరుగుతూ వచ్చింది. దీని అంచనా వ్యయం రూ.636.80 కోట్లు అయినప్పటికీ పనులు పూర్తయ్యే సరికి ఖర్చు రూ.799 కోట్లకు చేరింది. ఈ ఫ్లైఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, ఆరు లేన్లతో 4.08 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు సాఫీగా సాగుతాయి. అలాగే ప్రస్తుతమున్న తాడ్బన్, దానమ్మహట్స్, హసన్ నగర్ జంక్షన్ల లోని ట్రాఫిక్ సిగ్నళ్లు వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలుంటుంది. జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవడంతోపాటు, సమయం ఆదా కానుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్‌లో నిర్మించిన అత్యధిక పొడవైన ఫ్లైఓవర్ గా దీన్ని చెప్పవచ్చు.
ALSO READ | కేసీఆర్‌కు రైతు భరోసా ఇస్తం: మంత్రి పొంగులేటి
ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 2009 లో అందుబాటులోకి వచ్చింది. ఇది11.66 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో నిర్మించారు. అప్పట్లో ఎయిర్ పోర్టుకి వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు దీన్ని ఫ్లైఓవర్ ని నిర్మించారు. ఆ తరువాత 3 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో కొత్తగూడ ఫ్లైఓవర్ నిర్మించారు. అయితే ఇప్పుడు ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో 6లేన్లలో అందుబాటులో వస్తుంది. ప్రస్తుతం సిటీలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ ఇదే.