- త్వరలోనే కొడంగల్, మధిరలో నిర్మాణాలకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. శనివారం అసెంబ్లీ చాంబర్ లో అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఆర్కిటెక్ట్ పలు డిజైన్లను సీఎంకు చూపించారు. వాటిని పరిశీలించిన సీఎం అకాడమీ బ్లాకులు, డార్మిటరీలు, డైనింగ్ బ్లాక్స్, మల్టీపర్పస్ హాళ్లు, సిబ్బంది నివాస గృహాలు తదితరాల ఆకృతులు, అవి ఎంత విస్తీర్ణంలో ఉండాలనే దానిపై పలు సూచనలు చేశారు.
ఈ క్యాంపస్‌లు అన్ని రకాలుగా విద్యార్థులకు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఈ స్కూళ్లను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇతర నియోజకవర్గాల్లోనూ పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. కాగా, ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.330 కోట్లతో ఆర్కిటెక్ సంస్థ ప్రతినిధులు డీపీఆర్ తయారు చేయగా, ఇది చాలా ఎక్కువ ఉందని.. దీన్ని 200కోట్లకు తగ్గించాలని అధికారులు సూచించారు. కార్పొరేషన్‌కు సిబ్బంది కావాలని టీజీఈడబ్ల్యూడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంను కోరగా, వెంటనే సిబ్బందిని ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించారు. కొత్త డీపీఆర్ తయారయ్యాక మరో వారంలో భేటీ కావాలని నిర్ణయించారు. సీఎంను కలిసిన వారిలో సీఎస్ శాంతి కుమారి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ తదితరులున్నారు.