
- కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: సీఎం రేవంత్
- ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి
- మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న పొలిటికల్ డ్రామాలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాస్తవాలను జనాల్లోకి తీసుకెళ్లాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి వెనక్కి తీసుకున్న ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగించబోతున్నామనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు.
మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములపై జరుగుతున్న రగడతోపాటు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై చర్చించారు. విద్యార్థులను కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టి.. ప్రభుత్వానికి చెందిన భూమిని హెచ్ సీయూకు సంబంధించినదిగా అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికపై సమీక్షించారు.
ఈ వ్యవహారంలో ముందు నుంచి ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని మంత్రులను సీఎం ఆదేశించారు. విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్న పొలిటికల్ పార్టీల వ్యవహారాన్ని బయటపెట్టాలని, ధర్నాల వెనక ఉన్న చీకటి శక్తుల భరతం పట్టాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది.