
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లితో పాటు ఉన్నతాధికారులతో ఆదివారం పలుమార్లు మాట్లాడారు. కార్మికులను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నిరంతరాయంగా ఉబికి వస్తున్న నీళ్లతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని చెప్పారు. నీటిని బయటకు తోడెయ్యడంతో పాటు టన్నెల్‌లో లోపల ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బురద, శిథిలాలను తొలగించి ప్రమాదం జరిగిన చోటుకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు.
ప్రమాద తీవ్రత ఎక్కువుంది..
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. స్పాట్‌లో 200 మీటర్ల వరకు మట్టి, బుదర పేరుకుపోయింది. ప్రమాద ధాటికి వేల టన్నుల బరువుండే టీబీఎం మిషిన్వంద మీటర్లు వెనక్కు కొట్టుకొచ్చింది. మేం ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు వెళ్లలేకపోయాం. కొద్ది దూరంలో ఆగిపోయాం. చివరి వరకు వెళ్తేనే పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది. మేం బాధితుల పేర్లు పెట్టి పిలిచినా, రెస్పాన్స్ రాలేదు. రెస్క్యూ టీమ్ పనులు కొనసాగిస్తున్నది. ఇంకా మెషినరీ అవసరం ఉంది. వాటిని త్వరగా పంపిస్తాం.- మంత్రి జూపల్లి కృష్ణారావు
అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నం..
టన్నెల్‌లో చిక్కుకున్నోళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నం. డీవాటరింగ్, శిథిలాల తొలగింపు సవాల్‌గా మారింది. టన్నెల్ పైనుంచి, పక్క నుంచి డ్రిల్లింగ్ చేసే అవకాశాలపై ఆలోచన చేస్తున్నం. ఆర్మీ బృందాలతో పాటు ఉత్తరాఖండ్‌లో టన్నెల్ ఆపరేషన్స్ నిర్వహించిన ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపిస్తున్నం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
360 డిగ్రీల నుంచి నీళ్లు..
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 200 మీటర్ల వరకు బురద, డెబ్రిస్ పేరుకుపోయింది. టన్నెల్‌లో12 కిలోమీటర్ల వరకు లోకోలో వెళ్లాం. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల నుంచి 1.8 కిలోమీటర్ల దూరం వరకు కన్వేయర్ బెల్ట్‌పై నడుచుకుంటూ వెళ్లాం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 360 డిగ్రీల నుంచి నీరు ఉబికి వస్తున్నది.
నీటి ఊట కారణంగా మూడు మీటర్ల ఎత్తులో బురద, శిథిలాలు పేరుకుపోయాయి. ప్రమాద ధాటికి టన్నెల్ బోర్ మిషిన్ 90 మీటర్ల నుంచి వంద మీటర్లు వెనక్కి వచ్చింది. నీటిని తోడేందుకు ఐదు మోటార్లు, జనరేటర్లు వినియోగిస్తున్నాం. టన్నెల్ లోపల కరెంట్, ఆక్సిజన్ లేకపోవడం సమస్యగా మారింది. - శ్రీనివాస్ రెడ్డి, సింగరేణి రెస్క్యూ టీమ్జీఏం