జనవరి నెలాఖరులో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు షురూ..సీఎం రేవంత్ రెడ్డి

  • ఉస్మానియా దవాఖానకు నెలాఖరులోగా శంకుస్థాపన
  • కార్పొరేట్ హాస్పిటల్స్​కు దీటుగా నిర్మించాలి
  • అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచన

హైదరాబాద్, వెలుగు:ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశిం చారు. కార్పొరేట్ హాస్పిటల్స్​కు దీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని   సూచించారు. 

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై శనివారం తన ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. గోషామహల్​లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్ ల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఆ మ్యాప్ లలో పలు మార్పులు, చేర్పులను ఆయన సూచించారు. అన్నిరకాల ఆధునిక వసతులు ఉండేలా ఉస్మానియా దవాఖాన నిర్మాణం జరగాలన్నారు. 

రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో డిజైన్లు రెడీ చేయాలన్నారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదదీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు కూడా ఉండాలని చెప్పారు. 

సమీక్ష సమావేశంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ క్రిస్టీనా జడ్​ చొంగ్తు, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.