బీజేపీ పాలిత రాష్ట్రాలు సాధించలేని రికార్డులివి: ప్రధాని మోడీకి CM రేవంత్ కౌంటర్

బీజేపీ పాలిత రాష్ట్రాలు సాధించలేని రికార్డులివి: ప్రధాని మోడీకి CM రేవంత్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. ఇంకా రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని ప్రధాని మోడీ విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ కోసం రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ ట్వీట్‎కు 2024, నవంబర్ 2 శనివారం సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో అనేక అపోహలు, అవాస్తవాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. 

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లోని మొదటి రెండు గ్యారంటీలు అమలు చేశామని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు.. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచామన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కాకుండానే 22.22లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని.. గ్యాస్ సిలిండర్‌పై రూ.500సబ్సిడీ అందజేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పవర్‎లోకి వచ్చాక అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు.  గ్రూప్ 1, 2, 3,4 పరీక్షలు 11 నెలల కంటే తక్కువ సమయంలో నిర్వహించి 50,000 మంది అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలతో పాటు..ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించలేని రికార్డులు ఇవి అని మోడీకి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read :- వరద నష్టం ముష్టి రూ.400 కోట్లు ఇచ్చారు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా పాఠశాల విద్యార్థులను విస్మరిస్తే.. దశాబ్దం తర్వాత మేం సంక్షేమ హాస్టళ్లలో పేద పిల్లలకు  మెస్ అండ్ కాస్మొటిక్ చార్జీలను 40 శాతానికి పైగా పెంచామని చెప్పారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుభ్రం చేసి పునర్వైభవం తీసుకొస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో ఆక్రమణలకు గురైన సరస్సులు, నలాలు, చెరువులు, కుంటలను పరిరక్షిస్తున్నామని అన్నారు.  - కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదని పేర్కొన్నారు.  గత 11 నెలల్లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నాటి చీకటి, నిరాశ, నిస్పృహాలను తొలగించామని అన్నారు. అభివృద్ధి పథంలో తెలంగాణ ఇప్పుడు ఉదయిస్తోందన్నారు.