పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

హైదరాబాద్: మందిరాలు, మసీదుల వద్ద కొందరు మతవైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల ఫ్లాగ్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల ముత్యాలమ్మ గుడి వద్ద చోటు చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పోలీసులు నిందితులను వెంటనే పట్టుకొన్నారు. వారి మానసిక స్థితిని కూడా పరిశీలించారని అన్నారు. పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, అలాగైతేనే ఇతర దేశాల వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని అన్నారు. 

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకూ పరిష్కారం లభిస్తుందని చెప్పారు. పోలీసు ఉద్యోగం అనేది భావోద్వేగంతో కూడిన బాధ్యత అని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కృత్రిమ మేథ( ఏఐ)ని వినియోగించుకోవాలని చెప్పారు. ఇటీవల 13వేల మందికి కానిస్టేబుల్, 500 మందికి పైగా ఎస్సైలుగా పోస్టింగ్స్ ఇచ్చామని, అందులో చాలా మంది ఐఐటీలో చదువుకున్న వారున్నారని, ఎంటెక్ చేసిన వారున్నారని అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠినమైన పోలీసు శాఖను ఎంపిక చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. 

ALSO READ | విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం: సీఎం రేవంత్

అమరులైన పోలీసు కుటుంబాలకు పరిహారం పెంపు

విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు కుటుంబాలకు  పరిహారం పెంచుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విధి నిర్వహణలో చనిపోయిన ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని వివరించారు. అదే విధంగా శాశ్వత అంగవైకల్యం పొందితే రూ. 50 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 10 లక్షలు అందిస్తామని తెలిపారు. 

విధుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లే పోలీసులకు సంబంధించిన అన్ని ఖర్చులనూ ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, పోలీసులు ఆత్మాభిమానంతో పనిచేయాలని కోరారు. తెలంగాణ పోలీసులు రోల్ మోడల్‎గా నిలిచారని, ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారని వివరించారు. సేవలను మరింత విస్తృతం చేసి ప్రజల ధన,మాన, ప్రాణాలను కాపాడటంలో ముందుండాలని సీఎం ఆకాంక్షించారు. 

విధి  నిర్వహణలో అమరులైతే..

కేడర్                పరిహారం
ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్                               రూ. కోటి
సీఐ, ఎస్సై                1.25 కోట్లు
డీఎస్పీ, ఏఎస్పీ            1.50 కోట్లు
ఎస్పీ, ఐపీఎస్ ఆఫీసర్లు            2.00 కోట్లు

శాశ్వత అంగవైకల్యం
ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్                              రూ. 50 లక్షలు
సీఐ, ఎస్సై, డీఎస్పీ, ఏఎస్పీ                                  రూ. 60 లక్షలు
ఎస్పీ, ఐపీఎస్ ఆఫీసర్లు            రూ. కోటి

తీవ్రంగా గాయపడితే
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్
ఏఎస్ఐ, డీఎస్పీ , ఏఏఎస్పీ            రూ. 10 లక్షలు
ఎస్పీ, ఐపీఎస్ ఆఫీసర్లు            రూ. 12 లక్షలు

సైనిక్ స్కూల్ మాదిరిగా పోలీస్ స్కూల్

గోషామహల్ గ్రేహౌండ్స్‎కు  చెందిన యాభై ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‎ను ప్రారంభించనున్నామని, హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల వరకు అక్కడ ఆడ్మిషన్లు కల్పిస్తామని సీఎం చెప్పారు. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, స్పోర్ట్స్‎ను కూడా ప్రోత్సహిస్తామని వివరించారు. కోరుకొండ సైనిక్ స్కూల్స్ మాదిరిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎక్కడ చదువుకున్నమంటే పోలీస్ స్కూల్ అని గర్వంగా చెప్పుకొనే పరిస్థితిని కల్పిస్తామని అన్నారు.