ఇసుక అక్రమ రవాణాను అణిచి వేయండి: సీఎం రేవంత్ ఆదేశం

ఇసుక అక్రమ రవాణాను అణిచి వేయండి: సీఎం రేవంత్ ఆదేశం

= ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇవ్వాలంటే అడ్డుకట్ట వేయాల్సిందే
= సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణచివేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు తగినంత ఇసుక కావాంటే ముందుగా అక్రమార్కులపై కొరడా ఝుళిపించాలని సీఎం సూచించారు. ఇదిలా ఉండిగా ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులకు రూ. 5 లక్షలు అందించనున్నారు. 

వాళ్ల ఖర్చును తగ్గించేందుకు ఇసుకను ఉచితంగా అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అక్రమ రవాణా అడ్డుకట్ట తప్పనిసరి అని సీఎం పేర్కొన్నారు. అందుకే, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతోపాటు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.