సీఎం రేవంత్‌రెడ్డి ఒక విజనరీగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నిత్యం ఎన్నో సమస్యలు. మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజాపాలన అందిస్తున్నారు. ఒకవైపు రన్నింగ్‌లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణల కారణంగా కొన్ని పథకాల అమలు విషయంలో కొంత ఆలస్యం అవుతుందే తప్ప.. ఇచ్చిన హామీలన్నీ కూడా దశల వారీగా అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి ఉండదని కొందరి మాటలు విన్నాం. అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలలో ఒక విజన్ అనేది ఉండదని మరికొందరి వాదనలు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. తన మంత్రివర్గ సంపూర్ణ మద్దతు, ఆమోదంతో భవిష్యత్తు కార్యాచరణను చేపడుతున్నారు.
సీఎంగా రేవంత్‌రెడ్డి రోజుకు సుమారు 18 గంటల పాటు పని చేస్తూ తెలంగాణ ప్రజలు కలలు కన్న‘ రైజింగ్ తెలంగాణ’ నిర్మాణం చేస్తున్నారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా, స్వపక్షం నొచ్చుకున్నా ఆగకుండా రాష్ట్ర భవిష్యత్తునే లక్ష్యంగా తీసుకొని సీఎం ప్రజాపాలన అందిస్తున్నారు.
విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాలను రూపొందించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యా విధానాన్ని అమలుపర్చేందుకు తొలిసారిగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలోనూ మార్పులు తెస్తూ లాభసాటిగా మార్చేందుకు, రైతుల సంక్షేమానికి భరోసాగా నిలిచేందుకు వ్యవసాయ కమిషన్‌ను సైతం తొలిసారిగా ఏర్పాటు చేశారు.
ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి రూ.76,577 కోట్ల అప్పు ఉండగా. 2023 డిసెంబరు నాటికి అది రూ.6,71,757 కోట్లకు చేరింది. ఇందుకు ప్రతి నెల సుమారు రూ.7,500 కోట్లు అప్పులకు వడ్డీని చెల్లించాల్సి వస్తోంది. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మాత్రం ఆపకుండానే ప్రభుత్వం చాలాబాగా పని చేస్తోందని అర్థంచేసుకోవచ్చు. ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లను చెల్లిస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
గత పాలకులు ఆర్టీసీ సంస్థ అప్పుల్లో ఉంది అంటూ నిత్యం అనేవారు. ఇప్పుడు అదే ఆర్టీసీ ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. గత ఏడాది డిసెంబరు 9న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 107.26 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోగా వీరికి రూ.3,541.67 కోట్లు ఆదా అయింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య సైతం 40శాతం నుంచి 65.35 శాతానికి పెరిగింది. దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ సైతం 69శాతం నుంచి 94శాతానికి పెరిగింది.
సంక్షేమం సక్రమంగా అమలు
రూ.500లకే గ్యాస్ సిలెండర్‌ను అందించడం జరుగుతోంది. రాష్ట్రంలోని 46,67,510 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇప్పటివరకు ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.354.12 కోట్లను చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద అర్హులకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. జీరో బిల్లు కింద రాష్ట్రంలోని 49,51,725 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1158.42 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించింది.పేదలకు నాణ్యమైన వైద్య సేవలను కార్పొరేట్ ఆస్పత్రులలో అందించే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఏడాది కాలంలో వ్యవసాయ రంగానికి రూ.54,280 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
రైతు రుణమాఫీ
రైతులకు రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాల కంటే వేగంగానే చేశారని చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 25,35,964 మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీగా నిలిచిపోనుంది. ఇదే కాకుండా సన్న వడ్లకు ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ కూడా ప్రకటించింది. మరోవైపు ఏ రాష్ట్రంలో కానంత వరి దిగుబడి ఈ ఏడాది తెలంగాణకే సాధ్యమైంది.
నిరుద్యోగం తగ్గింది
నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో గత ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించలేదనే అపవాదు ఉంది. ఇది నిరుద్యోగులలో పెల్లుబికిన ఆగ్రహమే గత ప్రభుత్వాన్ని గద్దె దించిందనేది సుస్పష్టం. కానీ, ప్రజాపాలనలో ఏడాది కాలంలోనే 55 , 534 ఉద్యోగాలను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత తెలంగాణకే దక్కుతుంది.
నిరుద్యోగుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు రంగ సంస్థలకు సైతం ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో ఆయా రంగాలలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చదువుకున్న యువతలో నిరుద్యోగం ఏడాది కాలంలోనే 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గిందని కేంద్ర కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. యువతలో నిరుద్యోగాన్ని తగ్గించడంలో ప్రభుత్వం కొంత మేరకు విజయం సాధించిందనే చెప్పుకోవాలి.
స్కిల్ యూనివర్సిటీ అవసరం
రాష్ట్రంలోని యువత ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉద్యోగాలను సాధించాలంటే వారిలో నైపుణ్యం ఉండాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాలలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద క్రీడల విశ్వవిద్యాలయంగా నిలవనుంది.
హైదరాబాద్ అద్భుతం కాబోతుంది
బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు 200 ఎకరాలలో గాంధీ స్మారక నిర్మాణం చేయనున్నారు. నగరంలో 40 ఏళ్లుగా చెరువులు, కుంటలు, నాలాలు నిర్లక్ష్యానికి గురయి కబ్జాల పాలవుతున్నాయి. ఏ చిన్న వర్షం కురిసినా నగరం అల్లకల్లోలంగా మారిపోతోంది.
కబ్జాకు చెక్ పెట్టేందుకు సరికొత్తగా నగరంలో హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ ఏజెన్సీ(హైడ్రా)ను ఏర్పాటు చేసింది. నగర భవిష్యత్తునే లక్ష్యంగా దీనికి విస్తృతాధికారులను ప్రభుత్వం కల్పించింది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీని తెర మీదకు తెచ్చారు.
ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునిక నగరంగా నాలుగో(ఫోర్త్ సిటీ) నగరాన్ని నిర్మించాలనే సంకల్ఫంతోనే ముచ్చర్లలో ఈ సిటీ నిర్మాణానికి పునాది వేయడం జరిగింది.
ఇండస్ట్రీ గ్రోత్
ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.76,232 కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఐటీ రంగంలో మన హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.
ఏఐ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను తీసుకొచ్చింది.
తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ ప్లాన్-2050ను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు జరిగింది. రాబోయే నాలుగేళ్లలో మరెన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాలలో నంబర్ వన్‌గా ప్రపంచ పటంలో నిలపాలని ఆకాంక్షిద్దాం.
- డా.ఎన్.యాదగిరిరావు,అదనపు కమిషనర్,జీహెచ్ఎంసీ–