శత్రువు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాం.. వాళ్ల విష ప్రచారాన్ని తిప్పి కొడతాం: సీఎం రేవంత్

పెద్దపల్లి: ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదని కొందరు ప్రచారం చేశారు.. కానీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైందే కొత్తగూడెం నంచి.. కొత్తగూడెంలో మొదలైన మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదం నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 4) పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసగించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏడాది క్రితం అధికారంలో వచ్చాం. మీరు ఓట్లు వేస్తేనే మాకు పదవులు వచ్చాయి. మీ అందరి అభిమానంతో నేను ముఖ్యమంత్రిని అయ్యాయని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

మీ త్యాగాలు  నాకు తెలుసని.. మీ ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన ఉంటుందని.. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని బడిదుడుకులు ఎదురైనా భరిస్తానని స్పష్టం చేశారు. మాకు ఉద్యోగాలు కావాలనే నినాదంతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని.. కానీ గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగాలు రాలేదు.. రైతులకు గిట్టుబాటు ధర దక్కలేదని.. కేసీఆర్ హయాంలో రైతులు ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అన్నారు.. ఆయన మాత్రం వరి వేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఎకరాకు కోటీ ఆదాయం ఇప్పటికి బ్రహ్మ పదార్థమేనని.. కేసీఆర్‎కు మాత్రం ఎకరాకు కోటి పంట పండిందని ఎద్దేవా చేశారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే.. ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేదని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలను మోసం చేసినోళ్లు.. పది నెలలకే ఏం చేశారని రోడ్డెక్కి మమ్మల్ని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం కష్టపడి పని చేస్తోందని.. కడుపు మంటతో కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. శత్రువు ఏం చేస్తున్నాడో అన్ని గమనిస్తున్నామని.. వాళ్ల విష ప్రచారాన్ని తిప్పి కొడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.