
- ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు
- 21న ఒసాకా వరల్డ్ ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఏడు రోజుల జపాన్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి టోక్యోకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 16 నుంచి 22 వరకు టోక్యో, ఒసాకా, హిరోషిమా, మౌంట్ ఫుజి ప్రాంతాల్లో సీఎం రేవంత్ బృందం పర్యటించనుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జపాన్‌లోని ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించి.. రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై చర్చలు జరపనున్నారు. బుధవారం నారిటా ఎయిర్‌పోర్ట్‌లో రేవంత్ టీం సభ్యులు దిగుతారు.
తొలిరోజు భారత రాయబారితో సమావేశం అవుతారు. 17న ఉదయం సోనీ గ్రూప్, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సమావేశమవుతారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్‌తో భేటీ అవుతారు. టయోటా, ఐసిన్, ఎన్టీటీ సీఈవోలతో చర్చలు జరుపుతారు. సుమిదా రివర్ ఫ్రంట్‌ను కూడా సందర్శిస్తారు. 19న మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్‌లను సందర్శించి, ఓసాకాకు బయల్దేరుతారు. 20న కిటాక్యూషు మేయర్‌తో సమావేశమవుతారు.
ఎకో టౌన్ ప్రాజెక్టుపై చర్చలు జరుపుతారు. మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియంను సందర్శిస్తారు. 21న ఓసాకా వరల్డ్ ఎక్స్‌పోలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించి.. బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. తరువాత ఓసాకా రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. 22న వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో భేటీ అవుతారు.
పర్యటన అనంతరం కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి 23న ఉదయం సీఎం బృందం హైదరాబాద్ చేరుకుంటుంది. బుధవారం మంత్రి శ్రీధర్ బాబు జపాన్‌కు వెళ్లనున్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున అది చూసుకుని రావాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది.