మానేరులో ఇసుక తవ్వకాలకు బ్రేక్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా మానేరు నదిలో ఇసుక దోపిడీకి ఎట్టకేలకు చెక్ పడింది. ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆయన ఆదేశాలతో ఇసుక అక్రమ తవ్వకాలు నిలిచిపోయాయి. ఇటీవల మానేరు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సంది సురేందర్ రెడ్డి, సతీశ్ కుమార్ తోపాటు పలువురు ఇసుక క్వారీల బాధిత రైతులు హైదరాబాద్ లోని ప్రజాదర్బార్​లో ఫిర్యాదు చేశారు.

దీంతో జిల్లాలోని మానకొండూర్ మండలం ఊటూరు బ్లాక్–1, బ్లాక్–2లో, వీణవంక మండలం చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోరెకల్, పోతిరెడ్డిపల్లి/కల్లుపల్లి, జమ్మికుంట మండలం వావిలాల క్వారీల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచే టీఎస్ఎండీసీ పోర్టల్ లో ఇసుక బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. సోమవారం క్వారీల నుంచి జేసీబీలు, ఇతర మెషినరీని తరలించారు. ఇసుక లారీల వేగం కారణంగా యాక్సిడెంట్లు జరగడంతోపాటు కొందరు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో ఇసుక దందాపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కొత్త ప్రభుత్వం లారీలను బంద్ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులకు తిలోదకాలు.. 

వాగుల్లో, నదుల్లో వాణిజ్య అవసరాల కోసం చేపట్టే ఇసుక తవ్వకాలకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్(ఈసీ) తప్పనిసరి అని పర్యావరణ చట్టాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేనందున మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని 2022 డిసెంబర్ లోనే తొలిసారిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను మానేరుకు అటు వైపు ఉన్న పెద్దపల్లి జిల్లాకే పరిమితం చేసి.. ఇటు వైపున్న కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో ఓ యాక్టివిస్ట్​ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషన్ పై సమగ్రంగా విచారించిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. వాణిజ్య అవసరాలకు చేపట్టే ఇసుక తవ్వకాలకు ఈసీ తప్పనిసరి అని, క్లియరెన్స్ లేనందున మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని గతేడాది ఏప్రిల్ 28న బీఆర్ఎస్​ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఒకవేళ ఈసీ పొంది ఉంటే కాంట్రాక్ట్ ఏజెన్సీ తవ్వకాలు కొనసాగించవచ్చని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కరీంనగర్ జిల్లాలోని వావిలాల, ఊటూరు, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోరేకల్, పోతిరెడ్డిపల్లి, తనుగుల క్వారీల్లో తవ్వకాలపై స్టే కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో జిల్లా ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత లీగల్ ఒపినీయన్ తీసుకుని ఇసుక రీచ్ ల్లో నిల్వ ఉన్న ఇసుకను తరలించేందుకు నిరుడు జులై12న డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ పర్మిషన్ ఇచ్చింది.

దీంతో నాలుగున్నర నెలలు రీచుల్లోని ఇసుక తరలించారు. ఆ తర్వాత మానేరు నదిలో 59,81,749 క్యూబిక్ మీటర్ల ఇసుకను మరో ఏడాదిలోగా తోడేందుకు నిరుడు నవంబర్ 10న డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ పర్మిషన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈసీ రాకున్నా ఎలా అనుమతి ఇచ్చారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇసుక కాంట్రాక్టర్ల లాబీయింగ్, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతోనే ఉత్తర్వులు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు నెలల తవ్వకాలకు తాజా ఆదేశాలతో బ్రేక్ పడింది.

ప్రతిపక్షనేతగా విజిట్.. సీఎం హోదాలో ఆదేశాలు

పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిరుడు మార్చి 1న జమ్మికుంట మండలంలోని తనుగుల ఇసుక క్వారీని సందర్శించారు. ఇసుక క్వారీల నుంచి ఒకే పర్మిట్ మీద నాలుగైదు లారీల్లో ఇసుక తరలిస్తున్నారని, ఒకే నంబర్ మీద నాలుగైదు లారీలు నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు.

ఆ సందర్భంగా మానేరు వాగును జోగినపల్లి సంతోష్ తండ్రి రవీందర్ రావు కొల్లగొడుతున్నారని, వేల కోట్లు సంపాదించారని రేవంత్​ఆరోపించారు. జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేపట్టొద్దని, కూలీలతోనే తీయాలని, రెండు మీటర్లు మందమే తీయాలని నిబంధనలు ఉన్నా, అవేమి పట్టించుకోకుండా మట్టి తేలే వరకు తీస్తున్నారన్నారు. తాజాగా ఆయన సీఎం హోదాలో తవ్వకాలు నిలిపివేయడంతో అప్పటి పర్యటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.