Telangana: రైతులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్

హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. రెండో విడత రైతు రుణ మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో రేపు నిధులు జమ చేయనున్నారు. సీఎం రేవంత్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం నాడు రైతుల రుణమాఫీపై చెక్కులను ఆవిష్కరించనున్నారు. రూ.లక్షన్నరలోపు రుణాలు ఉన్నవాళ్లకు రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరు లోగా మాఫీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా రూ.లక్ష అప్పు ఉన్న రైతుల ఖాతాలో తెలంగాణ సర్కార్ ఇప్పటికే రూ.6,098.93 కోట్లను జమ చేసింది.

రైతు రుణ మాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయితే ఏకకాలంలో రూ.31 వేల కోట్లు మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించనుంది. దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రైతు రుణ మాఫీ చేయకపోవడం గమనార్హం. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇవాళ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. వివిధ శాఖల గ్రాంట్స్ పైనే చర్చ జరగనుంది. 19 పద్దులపై శాసస సభ చర్చించనుంది. ఆర్థిక నిర్వహణ, ప్రణాళిక, విద్యుత్ డిమాండ్ పై చర్చ జరగనుంది. 19 పద్దులపై చర్చించిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.